విజయనగరం అర్బన్: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నెల 24న ఇన్ సర్వీస్ టీచర్లకు ఇచ్చిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ సాధారణ డీఎస్సీ అభ్యర్థుల మాదిరిగానే ఉందని, దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. వెంటనే ఈ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఇన్ సర్వీస్ టీచర్లకు ఇచ్చిన స్పెషల్ టెట్ రద్దు చేస్తూ, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. ఒకవేళ నిర్వహించాల్సి వస్తే ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్ట్‌పై మాత్రమే టెట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. కులాలతో సంబంధం లేకుండా టెట్ పాస్ మార్కులు 40గా నిర్ణయించాలని, అలాగే పరీక్షలను కూడా ఆఫ్‌లైన్‌లో చేపట్టాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ పైడిరాజు, ప్రధాన కార్యదర్శి గంట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎ.సదాశివరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆర్. కృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మజ్జి శేషగిరిరావు, పి.కూర్మినాయుడు, జిల్లా గౌరవ సలహాదారులు ఎం.బలరాంనాయుడు, ఎన్.శ్రీదేవి, రాష్ట్రకార్యవర్గ సభ్యులు డి.వెంకట్‌నాయుడు, వై.మధుసూదనరావులతో పాటు జిల్లా, మండల స్థాయి నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ నాయకులు


