పార్వతీపురం రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) పార్వతీపురం మన్యం జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు నాయకులు స్పష్టంచేశారు. ఈ మేరకు స్థానిక పోస్టుమెట్రిక్ బోయ్స్ వసతి గృహంలో శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు హెచ్.సింహాచలం, కార్యదర్శి బి.అనిల్ మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్లీనరీ సాగుతుందన్నారు. సమావేశాలకు రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మన్యం జిల్లాలో విశ్వవిద్యాలయం, వైద్య, ఇంజినీరింగ్, ప్రభుత్వ ఐటీఐ కళాశాలలతో పాటు వివిధ మండలాల్లో డిగ్రీ, పీజీ కేంద్రాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఏఎనన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని కోరారు. భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేసే ప్లీనరీ సమావేశాలను విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.


