● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల జోరు
పార్వతీపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వినతులు పోటెత్తాయి. కనుమరుగవుతున్న సాగునీటి కాలువలను కాపాడాలని, గిరిజనుల భూములకు హక్కులు కల్పించాలని, నివాసాల మధ్య డంపింగ్ యార్డును రద్దు చేయాలని, తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు, గిరిజనులు, మహిళలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
కబ్జాల చెరలో కాలువలు..కాపాడండి
పార్వతీపురం కేంద్రంగా బెలగాం నుంచి నర్సిపురం వరకు వరహాల గెడ్డ, సాగునీటి కాలువలు కబ్జాకు గురవుతున్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు తదితరులు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డికి ఫిర్యాదు చేశారు. సురేష్ స్కూల్, వైకేఎం కాలనీల వద్ద కాలువలను మట్టితో కప్పేసి పక్కా భవనాలు నిర్మిస్తున్నారని, వరదలు వస్తే కాలనీలు జలమయం కావడం ఖాయమన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే కోట్లాది రూపాయల విలువైన నీటి వనరులు ఆక్రమణలకు గురవుతున్నాయని, పాత రికార్డుల ఆధారంగా సర్వే చేసి కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
గిరిజన భూములకు
అడంగల్ పునరుద్ధరించాలి
కురుపాం మండలం సప్పగొత్తిలిలో 1973లో 50 ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ‘డీ’ పట్టాలకు సంబంధించి ఈ ఏడాది అడంగల్, వన్–బి నిలిపివేయడంతో రాయితీలు అందడం లేదని బాధితులు వాపోయారు. అటవీ అధికారులు ట్రెంచ్‌లు తవ్వుతున్నారని, తక్షణమే రీ–సర్వే చేసి హక్కులు కల్పించాలని విన్నవించారు.
నివాసాల మధ్య డంపింగ్ యార్డ్ వద్దు
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని దళిత, బీసీ నివాస ప్రాంతాల (1, 2, 19, 20 వార్డులు) మధ్య కంపోస్ట్ యార్డు (ఎంఆర్‌ఎఫ్) ఏర్పాటును స్థానిక యువకులు తీవ్రంగా వ్యతిరేకించారు. రోగాల బారిన పడకముందే యార్డును ఊరికి 4 కిలోమీటర్ల దూరంలోని అట్టలి సమీపానికి తరలించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మద్దతుతో నిరసన తెలిపారు.
మూడేళ్లుగా దాహం కేకలు పట్టించుకోరా?
సీతానగరం మండలం చినభోగిలి ఎస్సీ వీధిలో మూడేళ్లుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రూ.1000 పనులకు కూడా నిధులు లేవని అధికారులు దాటవేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క వీధులకు వెళ్తే గొడవలు జరుగుతున్నాయని, తక్షణమే కొళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు.


