విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంటలకు అందరు రైతులకు ఉచిత బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. విశాఖ డెయిరీ అవినీతిపై శాసనసభ హౌస్ కమిటీ రిపోర్ట్ బయటపెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లీటరుపాలుకు రూ.5 ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. 2024 పంటల బీమాను అపరాలు, జీడి మామిడికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ అలైన్ మెంట్ మార్చి నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లోకవరపు ఆదినారాయణ మూర్తి, గోపాలం, గొంప కృష్ణమూర్తి, వర్రి మల్లయ్య, డి.వర్మ, వేమిరెడ్డి లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.


