● పోలీసుల అడ్డగింత
● కలెక్టరేట్ ఎదుట నిరసన హోరు!
పార్వతీపురం రూరల్: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ’జైల్ భరో’ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. పాత బస్టాండ్ వద్ద ప్రారంభమైన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. 26 మంది ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించగా, మిగిలిన నాయకులు ఆంక్షలను ధిక్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లి భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి సూర్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ తదితరులు మాట్లాడుతూ..అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశీయ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను హరించే నూతన లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షిస్తూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని స్పష్టం చేశారు. సౌందర్య థియేటర్ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్న మరో ప్రదర్శనలో రైతు కూలీ, గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొని నినాదాలు చేశారు. అరెస్టయిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు.


