డీఎస్సీ అక్రమాలకు నిరసనగా పాలకొండలోని వైఎస్సార్ కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఉదయం 6 నుంచి పోలీసులు పట్టణాన్ని ముట్టడించారు. ఇతర మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రంలోకి వచ్చే మార్గాలన్నింటిలోనూ మోహరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను పట్టణంలోకి అనుమతించలేదు. నాలుగు మండలాలకు చెందిన కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి నాయకుల ఇళ్లనూ చుట్టుముట్టారు. వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటిని కూడా భారీగా పోలీసులు, ప్రత్యేక పార్టీలతో దిగ్బంధించారు. వివిధ మార్గాల్లో ఎమ్మెల్సీ ఇంటి వద్దకు నియోజకవర్గంలో నాలుగు మండలాల నాయకులు చేరుకున్నారు. 11 గంటల సమయంలో ఎమ్మెల్సీ ర్యాలీకి సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే వారిని నిర్భందించడం, అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని విక్రాంత్ ధ్వజమెత్తారు. డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నందునే.. అది బయట పడకూడదనే కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులపై ఉక్కుపాదం మోపిందని విమర్శించారు. పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ దుప్పాడ పాపినాయుడు, సీనియర్ నాయకులు పాలవలస ధవళేశ్వరరావులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు.


