కేజీకి 900 గ్రాములే..! | - | Sakshi
Sakshi News home page

కేజీకి 900 గ్రాములే..!

Aug 11 2026 1:18 AM | Updated on Aug 11 2026 1:18 AM

రామభద్రపురం: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు గాడి తప్పుతున్నాయని వాటిని పరిష్కరించే నాథుడు కరువయ్యాడని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రేషన్‌ సరుకుల పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించే ఆహార సలహా సంఘాలు కానరావడంలేదు. దీంతో రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న నిత్యావసర సరుకులు ఇష్టానుసారం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

బియ్యం పంపిణీలో డీలర్ల ఇష్టారాజ్యం

జిల్లాలో రేషన్‌ 1254 దుకాణాలు ఉండగా వాటి పరిఽథిలో ఉన్న 5,70,980 కార్డులకు 9,02,06 మెట్రిక్‌ టన్నులు బియ్యం 11 ఎంఎల్‌ఎస్‌ గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. అయితే చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. డీలర్లు తూకాల్లో కిలోకి 100 గ్రాముల పైడి కోత విధించి బియ్యం ఇస్తున్నారని వాపోతున్నారు. మరి కొన్నిచోట్ల 20 కిలోలకు గాను సుమారు 3 కిలోల వరకు తక్కువ ఇస్తున్నట్లు తెలిసింది.ఈ విషయమై డీలర్లను ప్రశ్నిస్తే..ఎంఎల్‌ఎస్‌ గోదాంల నుంచే తూకాలు తక్కువ చేసి బియ్యం సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. వాటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

నిల్వ కేంద్రాల్లోనూ తక్కువగా..

ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ గోదాముల నుంచి డీలర్లు తీసుకుని రేషన్‌ దుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేస్తారు.అయితే గోదాముల నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో పెద్ద తేడా కనపడుతోందని డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోదాము నుంచి 50 కిలోల బస్తా తీసుకుంటే 48 కిలోలే వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల జిల్లాలో రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు బి.కాంతారావు రేషన్‌ దుకాణాల్లో అకస్మిక తనిఖీలు చేస్తున్న సమయంలో జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే తూకంలో తేడాలు వస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.తూకాల్లో తేడాలు వస్తే నిల్వ కేంద్రాల నుంచి బియ్యం తీసుకునేటప్పుడు డీలర్లు ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ భారాన్ని గోదాము నిర్వాహకులు, డీలర్లు కలిసి కార్డుదారుల మీదకు నెడుతున్నారని, ఇరు పక్షాలు కలిసి పేదల పొట్ట కొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నెత్తి చూడని లీగల్‌మెట్రాలజీ అధికారులు

తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన లీగల్‌ మెట్రాలజీ అధికారులు లబ్ధిదారులు నష్టపోతున్నా కనీసం కన్నెత్తి చూడడం లేదని, మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమమతమవుతున్నారని లబ్ధిదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మార్చి నెలలో రేషన్‌ డీలర్లకు చెందిన కాటాలను పరిశీలించి సీళ్లు వేశారు. అందుకు ఒక్కో డీలర్‌ నుంచి కాటా సీలుకు రూ.600, ఎప్పుడైనా కాటా రిపేరు వస్తే మరమ్మతు చేయడానికి రూ.400లు మొత్తం రూ.1000 తీసుకుని తాత్కాలిక రసీదు ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఒరిజినల్‌ లీగల్‌ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారైనా తనిఖీలు చేపట్టకపోవడంతో డీలర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల పంపిణీని అధికారులు కూడా తనిఖీ మానేశారనే విమర్శలు లేకపోలేదు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్డీవో అధ్యక్షతన ప్రజా సంఘాలు, అన్ని వర్గాలు, రాజకీయ పార్టీప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘం సభ్యులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలపై చర్చించాల్పి ఉంది. అయితే అధికారులు ఆహార సలహా కమిటీల ఏర్పాటు గాని, సమావేశాలు ఏవీ నిర్వహించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారుల పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేయకపోవడంతో పాటు ఆహార సలహా కమిటీ కానరాకపోవడంతో పేదలకు నిత్యావసర సరుకుల సరఫరా ఇష్టానుసారం చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

ఇష్టాను సారం పేదలకు రేషన్‌ డీలర్ల బియ్యం పంపిణీ

లబ్ధిదారులకు కోత విధిస్తున్న

రేషన్‌ డీలర్లు

ఎంఎల్‌ఎస్‌ గోదాం నిర్వాహకులు ఇవ్వడం లేదంటున్న డీలర్లు

పర్యవేక్షించని ఉన్నతాధికారులు

తనిఖీలు చేయని లీగల్‌ మెట్రాలజీ అధికారులు

ఇటీవల అకస్మికంగా గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement