జిల్లాలో 1.50 లక్షలకు పైగా ఓట్లకు గండం ముసాయిదా జాబితా విడుదల సర్ ప్రక్రియ తర్వాత భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య
ఆందోళన అవసరం లేదు..
సాక్షి, పార్వతీపురం మన్యం:
అనుకున్నదే అయ్యింది. ఓట్ల రాజకీయం మొదలైంది. భారీ సంఖ్యలో ఓట్లకు గండం ఏర్పడింది. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2026 మే 25 నాటికి జిల్లాలో 7,90,562 ఓట్లు ఉండగా.. సర్ ప్రక్రియ తర్వాత 7,15,443గా లెక్క తేలాయి. ఇందులో పురుషులు 3,49,188 కాగా.. మహిళలు 3,66,189 మంది ఉన్నారు. ఇతరులు 66 మంది.
సవరించిన జాబితా ప్రకారం.. మరణించిన వారు 36,003.. గుర్తించలేని/గైర్హాజరు 11,280, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 17,284, డబుల్ ఎంట్రీలు 10,462, ఇతరులు 90 ఓట్లు కలిపి మొత్తం 75,119 ఓట్లు డోలాయమానంలో ఉన్నాయి. ఈ ఓట్లన్నీ దాదాపు తొలగిపోయినట్లే. ఇదంతా ఒక ఎత్తయితే.. 19,952 ఓట్లు మ్యాపింగ్ కాకుండా మిగిలిపోయాయి. చిన్నచిన్న తప్పులు (తార్కిక వైరుధ్యాలు) ఉన్న ఓట్లు ఏకంగా 1,07,112 ఓట్లు ఉండడం గమనార్హం. పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పు దొర్లడం వంటివని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ తిరస్కరించారు. ఈ లెక్కన దాదాపు 1.50 లక్షలకు పైగా ఓట్లకు గండం ఏర్పడినట్లే. వీరందరికీ నోటీసులు ఇస్తామని అధికారులు అంటున్నారు. ఫారం 6, 7, 8ల ద్వారా తిరిగి ఓటును పునరుద్ధరించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందన్నది ప్రశ్నార్థకమే.
ప్రతి నియోజకవర్గంలో 30 వేల నుంచి 40 వేల వరకూ ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. సర్ ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా సాగింది. ఎన్యుమరేషన్ ఫారాలు శతశాతం పంపిణీ చేశామని చెబుతున్న అధికారులు.. చిరునామా లేక, ఇతర కారణాల వల్ల వాటిని తిరిగి తీసుకోలేకపోయిన ఓట్లు వేలల్లో ఉండడం గమనార్హం. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన బీఎల్‌ఏలు దగ్గరుండి కథ నడిపించారన్న విమర్శలు వచ్చాయి. రానున్న పంచాయతీ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, గ్రామీణ ప్రాంతాలు.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లనే లక్ష్యంగా చేసుకొని అధికారి పార్టీకి చెందిన నాయకులు చక్రం తిప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియోజక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్య
నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం
పాలకొండ 87,799 92,575 14 1,80,388
కురుపాం 86,331 91,328 41 1,77,700
పార్వతీపురం 85,443 87,815 8 1,73,266
సాలూరు 89,615 94,471 3 1,84,089
డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలను ప్రతి ఓటరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఓటరు పేరు నమోదు కాకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగుతున్నట్లయితే సంబంధిత ఎన్నిక ల నమోదు అధికారి/సహాయ ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించి ఆగస్టు 30లోగా దరఖా స్తు చేసుకోవచ్చు. మ్యాపింగ్, తార్కిక వైరుధ్యా లు కేటగిరీలలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత ఓటర్లు ఎన్నిక ల సంఘం సూచించిన పత్రాలలో ఏదో ఒక పత్రాన్ని, ఆధార్ కార్డుతో పాటు, నిర్దేశిత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది.
– ఎన్.ప్రభాకరరెడ్డి,
కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి.


