శ్రమ ఎక్కువ.. ధర తక్కువ | - | Sakshi
Sakshi News home page

శ్రమ ఎక్కువ.. ధర తక్కువ

Jul 27 2026 1:30 AM | Updated on Jul 27 2026 1:30 AM

ఏటా నష్టాలు తప్పడం లేదు

రూ.20కి కొని రూ.120కి అమ్మకం

సీతంపేట: మధుర ఫలాలుగా పిలవబడే సీతాఫలాల సీజన్‌ సీతంపేట ఏజెన్సీలో ఆరంభమైంది. ఈ ఏడాది దిగుబడులు ఆశించినంతగా లేవని గిరిజన రైతులు చెబుతున్నారు.ఽ మద్దతు ధరలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం కుశిమి వారపు సంతకు, ఆది, సోమవారాల్లో సీతంపేట మార్కెట్‌లోకి సీతాఫలాలను గిరిజన రైతులు తీసుకువస్తున్నారు. కావిడ సీతాఫలాలు రూ.1000 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. ట్రేలలో కూడా విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రే రూ.700 వరకు అమ్మకాలు చేస్తున్నారు. గతేడాది ట్రే సీతాఫలాలు రూ.1000 పైబడే అమ్మకాలు జరిపామని గిరిజనులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రారంభమైన సీజన్‌ అక్టోబరు మొదటి వారంతో ముగుస్తుంది. సీజన్‌ మధ్యలో ఎక్కువ మంది మార్కెట్‌కు సీతాఫలాలు తీసుకువస్తే దళారీ వ్యాపారులు రింగ్‌గా మారి ధరలు దించేస్తారని గిరిజన రైతులు వాపోతున్నారు. అప్పుడు కావిడ ధర రూ.500కు కూడా పడిపోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు. గిరిజనులకు పైనాపిల్‌ తర్వాత అత్యధిక ఆదాయాన్ని తెచ్చే పంట ఇది. ఈ ఏడాది పైనాపిల్‌ పండ్లతో నష్టాలు చవిచూసిన గిరిజనులు సీతాఫలంలోనైనా ఆదాయాలు వస్తాయేమోనని ఆశతో ఉన్నారు.

500 ఎకరాల్లో పంట సాగు..

సీతంపేట ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో భాగంగా దాదాపు 500 ఎకరాల్లో సీతాఫలం పంట సాగవుతుంది. సుమారు 200 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కొండపోడు పంటలతో పాటు కొండదిగువన కూడా సీతాఫలాల చెట్లు ఉంటాయి. ఖరీఫ్‌ సీజన్‌లో వరిలో పెట్టుబడులు పెట్టడానికి ఈ పంట ఎంతో దోహద పడుతుందని గిరిజనులు చెబుతున్నారు. గతేడాది మొదట్లో ఇదే ధరలు ఉన్నప్పటికీ మద్యలో ధరలు తగ్గిపోయాయి. గిరిజనులు నిల్వ చేసుకోవడానికి వీలుకాని పండ్ల జాతిలో సీతాఫలం ఒకటి. చెట్టునుంచి తీసిన పండ్లు రెండు, మూడు రోజుల్లో విక్రయించకపోతే పండు కుళ్లిపోతుంది.

ధరలు ఉంటాయో లేదో తెలియదు

ధరలు ఎంత వరకు నిలబడతాయో తెలీదు. గతంలో ఒక్కొక్కరు రూ.10 వేల వరకు ఆదాయం సంపాదించే వారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేని పరిస్థితి ఉంది.

ఎస్‌.సురేష్‌, బుడగరాయి

ప్రతి ఏటా నష్టాలు తప్పడం లేదు. సీజన్‌ ఆరంభంలో ఽసరైన ధరలు పలుకుతాయి. మధ్యలో ధరలు పడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పైనాపిల్‌ విక్రయాల్లో సైతం నష్టాలు చవిచూశాం.

ఎస్‌.సుక్కయ్య, ఈతమానుగూడ

సీతాఫలాల సీజన్‌ ఆరంభం

500 ఎకరాల్లో పంట సాగు

200 టన్నులకు పైగా దిగుబడి

కావిడ ధర రూ.1000 రూ.1200

మైదాన ప్రాంతాల్లో డిమాండ్‌

ఒడిశా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి సీతాఫలాలు కొనుగోలు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో వారు కిలోల వంతున విక్రయించి లాభాలు ఆర్జిస్తారు. ఇక్కడ కిలో సరాసరి రూ.20 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు అమ్మకాలు జరుపుతారు. కొంతమంది దళారీ వ్యాపారులు సీజన్‌ ఆరంభంలోనే గ్రామాల్లోకి వెళ్లి అడ్వాన్సులు ఇచ్చి పంట కొనుగోలు చేస్తారు. అప్పట్లో కావిడ రూ.400 చొప్పున వ్యాపారులు అడ్వాన్స్‌ ఇస్తే ఇప్పుడు కూడా అదే ధరలకు ఆ వ్యాపారులకు విక్రయించాల్సి ఉంటుంది. కావిడ రూ.1200లు ఉన్నా పాత ధరకే ఇవ్వాల్సి ఉంటుందనే నిబంధనలు వ్యాపారులు పెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement