● వాహనదారులు చొరబడకుండా సూచిక బోర్డుల ఏర్పాటు ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ● మీటింగ్ స్థలానికి వాహనాలు వచ్చే మార్గాల పరిశీలన
పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు వెళ్లవలసిన మార్గాలు, వాటికి కేటాయించిన పార్కింగ్ స్థలాల ను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడూతూ భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. వాహనాలు వచ్చే మార్గాల్లో వాహనదారులు దారి తప్పకుండా, స్పష్టంగా కనిపించే విధంగా ప్రధాన జంక్షన్‌లలో పెద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మార్గాల నుంచి వచ్చే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించా రు. బందోబస్తు నిమిత్తం విధులకు వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణంతో పాటు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధాని పర్యటన వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అత్యున్నత స్థాయి నిఘా, పటిష్టమైన భద్రతా బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.


