● సీతంపేటలో ఆదివాసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం
సీతంపేట: ఆదివాసుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు, భూ హక్కుల సంరక్షణ చట్టాల సమర్థవంతమైన అమలు కోసం ఐక్యంగా ఉద్యమించాలని సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సామాజిక భవనంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానించారు. ప్రధానంగా జీవో నంబర్ 3, వన్‌బై సెవెన్టీ చట్టం, పీసాచట్టం, అలాగే ఆదివాసుల హక్కులకు సంబంధించిన ఇతర ముఖ్యమైన చట్టాల అమలు, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చట్టాల అమలులో ఉన్న లోపాలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడంతో పాటు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు నిర్ణయించారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం భారీ ప్రజా కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ కార్యక్రమానికి సంబంధించిన తేదీని ఒకటి లేదా రెండు రోజుల్లో ఖరారు చేసి ప్రకటించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
హక్కుల సాధనలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, యువత ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీతంపేట జేఏసీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు కొండగొర్రి ధర్మారావు, రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు బిడ్డిక తేజేశ్వరరావు, జేఏసీ నాయకులు కొండగొర్రి సుబ్బారావు, బి.దమయంతినాయుడు, బి.ఉమామహేశ్వరరావు, నిమ్మక కాంతారావు, కె.భాస్కరరావు, బి.రామ్మోహన్‌రావు జేఏసీ కార్యదర్శులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


