పాచిపెంట: మండల కేంద్రంలోని పద్మాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తరలింపు అంశం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని తాత్కాలికంగా సాలూరు వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్)కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మూడు ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. తమ పిల్లలను సాలూరు వైటీసీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించబోమని స్పష్టం చేస్తూ ఆందోళనకు దిగారు. అవసరమైతే తమ పిల్లలకు ట్రానన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇచ్చేయాలని నినాదాలు చేశారు. దీంతో పాఠశాల ఆవరణలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వైటీసీపై అభ్యంతరాలు..
సాలూరులోని వైటీసీ శ్మశానవాటికకు సమీపంలో ఉండడంతో పాటు తమ గ్రామాలకు దూరంగా ఉండడంతో అక్కడ చిన్నారులను ఉంచడం సమంజసం కాదని తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లల భద్రతతో పాటు వారి మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా అయినా అందుబాటులో ఉండే, అనువైన ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను కొనసాగించాలని అధికారులను కోరారు.
చర్చల తర్వాత విద్యార్థుల తరలింపు
తల్లిదండ్రుల నిరసనతో విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొంతసేపు నిలిచిపోయింది. ఈ సమాచారం అందుకున్న అధికారులు, ఐటీడీఏ సిబ్బంది తల్లిదండ్రులతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చివరకు కొంతమంది తల్లిదండ్రులను ఒప్పించడంతో సుమారు 130 మంది విద్యార్థులను సాలూరు వైటీసీకి తరలించారు. అయితే మిగిలిన 80 మంది విద్యార్థులను తల్లిదండ్రులు తమ వెంట తీసుకెళ్లిపోయారు. సరైన ప్రత్యామ్నాయం చూపించే వరకు పిల్లలను పంపే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, విద్యార్థుల భద్రతకు భంగం కలగకుండా, తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వైటీసీకి పిల్లలను పంపబోమంటూ బస్సుల అడ్డగింత
తల్లిదండ్రులను ఒప్పించి 130 మంది విద్యార్థుల తరలింపు
80 మందిని వెంట తీసుకెళ్లిన తల్లిదండ్రులు


