పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు సెల్లార్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీలను మీ కోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల నమోదు, అర్జీల స్థితి దానికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
సెప్టెంబర్ 27న ఏకపాత్రాభినయ పోటీలు
పార్వతీపురం: శ్రీ వాణి ఆర్ట్స్ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో సెప్టెంబర్ 27న ఉత్తరాంధ్ర స్థాయి పౌరాణిక పద్యనాటక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.పీజేనాయుడు ఆదివారం తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు కళాకారులు పాల్గొనే ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.5,200తో పాటు ఇత్తడి కిరీటం, ద్వితీయ బహుమతిగా రూ.3,400, తృతీయ బహుమతిగా రూ.2,500 నగదు, షీల్డ్ అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు ప్రత్యేక బహుమతులు కూడా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల కళాకారులు డా. పీజేనాయుడు(9440012010), ఎం.సింహాచలం (9849833439), జి.చినతిరుపతి(95507 54406) ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
జిల్లాలో ఎలక్ట్రోరల్ ఫారాల పరిశీలన పూర్తి
పార్వతీపురం: జిల్లాలో ఓటర్ల ఎలక్ట్రోరల్ ఫారాల నమోదు, పరిశీలన ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లాలోని మొత్తం 7,90,562 మంది ఓటర్లలో 7,15,450 (90.50 శాతం) ఫారాలను డిజిటలైజ్ చేయగా, మిగిలిన 75,112 ఫారాలు మరణాలు, వలసలు, చిరునామా మార్పుల కారణాలతో సేకరించలేనివిగా నమోదయ్యాయని వెల్లడించారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన పౌరులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలని కలెక్టర్ కోరారు.
విజయనగరం అర్బన్: ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం)’ విశిష్టతను ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘30 సెకన్ల గ్రూప్ రీల్’ ‘సెల్ఫీ రీల్’ కాంటెస్ట్‌లను నిర్వహిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కేఎస్ విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘విమానాశ్రయం మీ దృష్టిలో ఏమిటి? మీకు ఎందుకు గర్వకారణం?’అనే అంశంపై 30 సెకెన్ల నిడివితో గ్రూప్ లేదా సెల్ఫీ వీడియో రూపొందించాలి. రీల్‌ను మీ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ ఏపీఅఫీయల్ న్యూస్ ఖాతాను ట్యాగ్ చేయాలి. ప్రచురించేటప్పుడు ఏఎస్‌ఆర్‌ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హ్యాష్ ట్యాగ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎంపిక చేసిన టాప్–5 విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. ఆసక్తిగల యువత తమ వీడియోలను ఈ నెల 29లోగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
బొండపల్లి: వరుణుడి కటాక్షం కోసం రైతులు, చిన్నారులు బొండపల్లి మండలంలోని గిట్టుపల్లి గ్రామంలో ఆదివారం కప్పల పండుగను నిర్వహించారు. కప్పల పండుగ చేస్తే తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం గ్రామాల్లోని రైతులకు ఉండడంతో చిన్నారులు, పెద్దలు కలిసి గ్రామంలో కప్పలను పసుపుబట్టల్లో కట్టి ఇంటింటికీ తీసుకువెళ్లి స్నానాలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిసి పంటలు సాగు చేయడానికి అవకాశం కల్పించి ముందుకు నడిపించాలని గ్రామంలోని చిన్నా పెద్దా పండుగను నిర్వహించి, పూజలు చేశారు.


