ఇదేం స్మార్ట్‌ మీటర్‌ బాబూ..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం స్మార్ట్‌ మీటర్‌ బాబూ..!

Jul 18 2026 9:57 AM | Updated on Jul 18 2026 9:57 AM

ఇదేం స్మార్ట్‌ మీటర్‌ బాబూ..!

తరచూ అంధకారంలో వీధులు

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు

గజపతినగరం రూరల్‌: విద్యుత్‌ సరఫరాలో నాణ్యతను పెంచడం, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించడం, విద్యుత్‌ వినియోగాన్ని కచ్చితంగా నమోదు చేయడం, లోపాలను వేగంగా గుర్తించడం వంటి లక్ష్యాలతో విద్యుత్‌ శాఖ పర్యవేక్షణలో థర్డ్‌ పార్టీకి చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వీధి దీపాల విద్యుత్‌ స్తంభాలకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసింది. ఈ ఆటోమేటిక్‌ సిస్టం ద్వారా సాయంత్రం 6 గంటలకు వీధిలైట్లు వెలిగి, ఉదయం 6 గంటలకు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. అయితే, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అమర్చిన ఈ స్మార్ట్‌ మీటర్లు కొత్త చిక్కులను తెచ్చి పెడుతున్నాయి. తద్వారా ప్రజలకు, పంచాయతీ అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్మార్ట్‌మీటర్లు అమర్చిన తర్వాత కొన్ని గ్రామాల్లో తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆయా గ్రామ ప్రజలు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పంచాయతీ అధికారులు ఈ సమస్యను విద్యుత్‌ శాఖ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లడం వారు నేరుగా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఉండడంతో, థర్డ్‌ పార్టీ సంస్థ ప్రతినిధులకు తెలియజేయడంతో కాలయాపన జరుగుతోంది. దీంతో విద్యుత్‌ సమస్యకు పరిష్కారం రోజుల తరబడి పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న లోపాన్ని సరిచేయడానికే థర్డ్‌ పార్టీ సిబ్బంది కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రావడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఫిర్యాదు చేసిన వెంటనే పంచాయతీ ఎలక్ట్రిషియన్‌ వచ్చి క్షణాల్లో మరమ్మతులు చేసి వీధిలైట్లు వెలిగించేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పంచాయతీ అధికారులకు ఈ విధానం తలనొప్పిగా మారింది. పది రోజులుగా మెంటాడ రోడ్డులో వీధిలైట్లు వెలగక కాలనీ ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు. అలాగే సంతతోటకాలనీలోని శివాలయం వీధి, షరాబుల కాలనీలో కూడా వీధి దీపాలు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి. దాదాపు మండలంలోని చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు తరచూ ఉత్పన్నమవుతున్నాయి.

స్మార్ట్‌ మీటర్ల అసలు ఉద్దేశం ఏమిటి?

విద్యుత్‌ వినియోగాన్ని కచ్చితంగా నమోదు చేసి విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టాలనేదే ప్రధాన ఉద్దేశం. అలాగే విద్యుత్‌ లోపాలను వెంటనే గుర్తించి సేవలను మెరుగుపరచడం దీని లక్ష్యాల్లో ఒకభాగం. అయితే, క్షేత్రస్థాయిలో ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతున్నాయన్న ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? వాటిలో లోపాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించే వ్యవస్థ కూడా ఉండాలి కదా?‘ అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. థర్డ్‌ పార్టీపై పూర్తిగా ఆధారపడడంతో విద్యుత్‌ శాఖ బాధ్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

ప్రజల డిమాండ్‌

స్మార్ట్‌ మీటర్ల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించి, తరచూ ఏర్పడుతున్న లోపాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే థర్డ్‌ పార్టీ సిబ్బందిపై మాత్రమే ఆధారపడకుండా స్థానిక విద్యుత్‌ శాఖ సిబ్బందికీ అవసరమైన శిక్షణ ఇచ్చి అత్యవసర మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని అటు పంచాయతీ అధికారులు ఇటు ప్రజలు కోరుతున్నారు.

జాప్యం జరుగుతోంది

స్మార్ట్‌ మీటర్లు అమర్చకముందు వీధిలైట్ల సమస్య రాగానే ఎలక్ట్రిషియన్‌ సమస్యను పరిష్కరించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమస్య వస్తే విద్యుత్‌ శాఖ సిబ్బందికి తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా వారు ఏజెన్సీకి తెలియజేసి సమస్యను పరిష్కరిస్తున్నారు. దీనివల్ల కొంత జాప్యం జరుగుతోంది. – ఎ.జగదీష్‌,

పంచాయతీ కార్యదర్శి, పురిటిపెంట

ఏజెన్సీ వాళ్లకు సమస్య

తెలియజేస్తున్నాం

మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యను ఏజెన్సీ నిర్వాహకులకు తెలియజేస్తున్నాం. వారు వెంటనే సమస్యను తెలుసుకుని అక్కడి నుంచే పరిష్కారాన్ని చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్లు వీధి దీపాలకు అమర్చాం. దీనివల్ల విద్యుత్‌ ఆదా అవుతుంది.

–కృష్ణ, ఏఈఈ, ట్రాన్స్‌కో, గజపతినగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement