సాలూరు: వివాదాస్పద ఆంధ్రా ఒడిశా సరిహద్దు కొఠియా గ్రామంలో ఒడిశా ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా రథయాత్ర నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూరీలో రథయాత్ర నిర్వహించిన మరుసటి రోజు ఇక్కడ రథయాత్ర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. కొఠియా గ్రూప్ గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవంలో భాగంగా ఆలయం నుంచి గుండిచా మందిరానికి రథాన్ని తరలించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ మహాజన్, ఎస్పీ అభిషేక్ వర్మ తదితరుల ప్రత్యేక పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కదెం, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచో తదితరులు పాల్గొన్నారు.


