హెచ్‌ఐవీ రోగులకు ఆపరేషన్‌ కష్టాలు..! | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ రోగులకు ఆపరేషన్‌ కష్టాలు..!

Jul 18 2026 9:57 AM | Updated on Jul 18 2026 9:57 AM

హెచ్‌ఐవీ రోగులకు ఆపరేషన్‌ కష్టాలు..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగని శస్త్రచికిత్సలు

అధిక మొత్తంలో వెచ్చించి ప్రైవేట్‌

ఆస్పత్రిలో చేయించుకుంటున్న పరిస్థితి

విజయనగరం ఫోర్ట్‌:

హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష చూపకూడదని, సాధారణ వ్యక్తుల మాదిరి వారికి కూడా వైద్యసేవలు అందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే అది అమలుకు నోచుకోవడం లేదు. విజయనగరం పట్టణానికి చెందిన ఓ హెచ్‌ఐవీ బాధితుడికి హైడ్రోసిల్‌ వాపు రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి కొద్ది రోజుల క్రితం వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి ఆపరేషన్‌ చేయడానికి అవసరమైన వైద్య పరీక్షలు రాశారు. వైద్య పరీక్షల్లో అతనికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆపరేషన్‌ చేయడానికి పలుమార్లు తిప్పించి చివరికి శస్త్రచికిత్స చేయకుండా పంపించేశారు. నొప్పి భరించలేకపోతున్నానని చెప్పినా శస్త్రచికిత్స చేయలేదు. దీంతో తగరపువలసలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లేందుకు బాధితుడు సిద్ధమవుతున్నాడు. ఇలా ఈ ఒక్క రోగే కాదు. అనేక మంది హెచ్‌ఐవీ రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోనే కాకుండా మిగతా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా హెచ్‌ఐవీ రోగులకు వైద్యసేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వేలాది మంది హెచ్‌ఐవీ రోగులు ఉన్నారు. వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చికిత్స అందించడానికి గానీ, శస్త్రచికిత్స చేయడానికి గాని వైద్యులు ఇష్టపడడం లేదని హెచ్‌ఐవీ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు, గైనిక్‌ సమస్య ఉన్న మహిళలకు, కడుపు నొప్పి, పేగు ఒరుపు, హెర్నియా,హైడ్రోసిల్‌, ఈఎన్‌టీ, ఎముకలు, నరాలు తదితర శస్త్రచికిత్సలు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధిక మొత్తంలో వెచ్చించి ఆపరేషన్‌

జిల్లాలో 6,670 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. వారిలో పురుషలు 2,755 మంది కాగా మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందక ఆపదవేళ పలువురు హెచ్‌ఐవీ రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం అధిక మొత్తంలో వెచ్చిస్తున్నారు. హైడ్రోసిల్‌, ఫైల్స్‌ శస్త్రచికిత్సలకు రూ. 25 వేల నుంచి రూ.30 వేలు, గైనిక్‌ సర్జరీలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేస్తున్నారు. హెర్పియా, కడుపు నొప్పి వంటి శస్త్రచికిత్సలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

హెచ్‌ఐవీ రోగులకు అవసరమైన చికిత్స, శస్త్రచికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయాలని ఆదేశాలు ఇచ్చాం. హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స అందించడంలో అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకుంటాం.

డాక్టర్‌ కె. రాణి, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement