సువర్ణముఖిలో సైకత వేట | - | Sakshi
Sakshi News home page

సువర్ణముఖిలో సైకత వేట

Jul 18 2026 9:21 AM | Updated on Jul 18 2026 9:21 AM

సువర్ణముఖిలో సైకత వేట

సువర్ణముఖి నదిలో ముడుకు లోతు నీటిలో ఇసుక వేటకు ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. ఇసుకలోడుతో ఉన్న ట్రాక్టర్‌ నదిలో ఇరుక్కుపోవడంతో మరో రెండు ఇంజిన్లను తెప్పించి ఇదిగో ఇలా ఒడ్డుకు చేర్చుతున్నారు. మక్కువ మండలం డి.శిర్లాం గ్రామ సమీపంలో సువర్ణముఖి నదిలో శుక్రవారం కనిపించిన ఈ చిత్రం ఇసుక అక్రమ తవ్వకాలకు

నిదర్శనమని, అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

మక్కువ:

సాలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. రెండేళ్లుగా అధికార బలంతో నదులను గుల్లచేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ వ్యాపారంలో అధికారులకు సైతం వాటాలు వెళ్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నదీ ప్రవాహం మారేలా ఇసుక తవ్వకాలు సాగుతున్నా అధికారుల కళ్లకు కనిపించకపోవడంపై నదీ తీర గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మక్కువ మండలంలోని డి.శిర్లాం, మక్కువ, చెముడు గ్రామాల సమీపంలోని సువర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లపై ప్రతిరోజూ తరలిస్తున్నా చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. మక్కువ, సీతానగరం మండలాల సమీపంలోని కొత్తవలస ఆనకట్ట వద్ద సైతం మొన్నటివరకు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అధికారులు ట్రెంచ్‌ల తవ్వకంతో ఇసుక తవ్వకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

నీటిలో ఇసుకనూ వదలడం లేదు

డి.శిర్లాం సువర్ణముఖినదిలో ప్రవహించే నీటిలో నుంచి ఇసుకను ఎత్తేస్తున్నారు. నదిలో నీటి నుంచి ఇసుకలోడుతో ఉన్న ట్రాక్టర్‌ను మరో రెండు ఇంజిన్ల సహాయంతో బయటకు తీసుకువస్తున్నారు. వాస్తవానికి డి.శిర్లాం గ్రామం వద్ద సువర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్నా, ఇసుకరీచ్‌ నుంచి ఎటువంటి చలానాలు, రసీదులు తీసుకోకుండా రీచ్‌కు కాస్త దూరంగా నదిలో తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టవేయాలని తీర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement