● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
● సీతంపేటో ఆగ్రోఫ్రెష్ షాపు ప్రారంభం
సీతంపేట: రైతులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారుకావాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సీతంపేటలో ఆదివాసీ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఆగ్రో ఫ్రెష్ సేంద్రియ, చిరుధాన్యాల విక్రయ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ఉత్పత్తులను విలువ ఆధారిత వస్తువులుగా తయారు చేసి విక్రయించడం వల్ల మంచి ఆదాయం వస్తుందన్నారు. గిరిజన మహిళా రైతులు పండించే పౌష్టికాహార ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించనున్నట్లు చెప్పారు. సమాజానికి కూడా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. సంప్రదాయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులన్నీ ఇక్కడ లభిస్తాయని అన్నారు. ప్రకృతి ప్రసాదం..ఆరోగ్యకరమైనజీవనం అనే నినాదంతో ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన ఉత్పత్తులను ఇక్కడ విక్రయించనున్నట్టు తెలిపారు. నాబార్డ్ జిల్లా మేనేజర్ దినేష్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆన్‌లైన్‌మార్కెట్ కూడా చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్, ఆర్ట్స్ డైరెక్టర్ నూక సన్యాసిరావు, ప్రాజెక్టు హార్టీకల్చర్ ఆఫీసర్ ఎస్.వి గణేష్, తహసీల్దార్ శ్రీకన్య, ఎంపీడీఓ మిశ్రో, మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈవో ఆరిక గౌతమి తదితరులు పాల్గొన్నారు.


