లోపల కత్తులు!
కూటమిలో కస్సుబుస్సు
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
బీజేపీ.. సొంతంగా ఎదగాలనుకుంటుందా?
సాక్షి, పార్వతీపురం మన్యం :
●పాలకొండ నియోజకవర్గం వండువలో గత ప్రభుత్వ హయాంలో రైతులకు అందిన రైతుభరోసా.. నేడు ఇవ్వడం లేదని జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బహిరంగంగానే అంగీకరించారు. ఇదే విషయమై అధికారులకూ ఫిర్యాదు అందించారు.
●పాలకొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ఇటీవల ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలకు పథకాలేవీ అందకుండా అడ్డుకుంటున్నారని.. కనీసం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
●పార్వతీపురంలో జనసేనను అసలు పట్టించుకోవడం లేదని.. ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదాడ మోహనరావు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైఖరి, పనితీరు పట్ల విసుగు చెంది ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో సమస్యలపై నేరుగా పోరాడుతానని గతంలో ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
●తాజాగా బీజేపీ నాయకులు ‘జనతా వారధి’ అంటూ సోమవారం ఓ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ వద్ద హడావిడి చేశారు.
విచిత్రమేమిటంటే.. వీరంతా కూటమిలో భాగమే.. మిత్రపక్షమే. అదంతా పైస్థాయిలోనే. క్షేత్రస్థాయికి వచ్చేసరికి.. పైకి పొత్తులు, లోపల కత్తుల మాదిరి ఉంది పరిస్థితి. జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సఖ్యత లేదనడానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలే. పాలకొండ నియోజకవర్గంలో జనసేన–టీడీపీ మధ్య ఎప్పటినుంచో భగ్గుమంటోంది. పార్వతీపురం నియోజకవర్గంలోనూ జనసేన అంటూ ఒకటుందని టీడీపీ ఎమ్మెల్యే గుర్తించిన పరిస్థితి లేదు. పాలకొండలో టీడీపీ నేత.. పార్వతీపురంలో జనసేన నాయకుడు ఈ విషయాన్ని తమ అధినేతల దృష్టికీ తీసుకెళ్లారు. సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో జనసేన ఉనికే లేకుండా చేశారు.
ఇక కేంద్రంలో అధికారలో ఉన్న కూటమి మరో కీలక మిత్రపక్షం బీజేపీ. అసలు ఆ పార్టీని ఎక్కడా కలుపుకొని వెళ్లే పరిస్థితి ఈ ఏడాదిన్నర కాలంలో జిల్లాలో కనిపించలేదు.
ఏడాదిన్నర కాలంలో జిల్లాలో బీజేపీ అంటూ ఒకటుందని ఏ నియోజకవర్గంలోనూ గుర్తించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఆ పార్టీనే కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంతంగా తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. మిత్రపక్షంలో ఉన్నప్పటికీ.. సోమవారం కలెక్టరేట్ వద్ద ఓ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర నేత రెడ్డి పావని, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ఇతర నాయకులు.. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ప్రజలను ఆరా తీశారు. వారి సమస్యలు తెలుసుకుని, వాటిని వారే స్వయంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మిత్రపక్షంలో ఉండి.. ప్రజా సమస్యలను అధికారుల వద్దకు తీసుకెళ్లడమంటే పరోక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించినట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో తమకంటూ సొంతంగా ఒక గుర్తింపును బీజేపీ కోరుకుంటున్నట్లు ఉందని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం.. అధికారులు కూడా తమను గుర్తించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తోంది.


