గ్రామస్థాయి నుంచే పార్టీ పటిష్టత
పార్వతీపురం రూరల్: రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం పార్వతీపురంలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కమిటీల నియామకంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, పరిశీలకులు శరగడం చిన్నప్పలనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. పార్టీ పటిష్టతలో గ్రామస్థాయి కమిటీలే కీలకమని, క్షేత్రస్థాయిలో కేడర్‌కు నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి ఫిబ్రవరి 18 వరకు కేటాయించిన 45 రోజుల గడువులోగా గ్రామస్థాయి నుంచి అన్ని అనుబంధ విభాగాల కమిటీల పునర్నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు సూచించారు. ఇప్పటికే మండల స్థాయి ప్రక్రియ ముగిసినందున, ఇప్పుడు ప్రతి రెండు గ్రామాలకు ఒక ఇన్‌చార్జిని నియమించి సమన్వయం చేయాలని కోరారు. కమిటీల నియామకంలో సమర్థులైన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, పారదర్శకత కోసం డిజిటల్ మేనేజర్ల సేవలను వినియోగించుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఎంపికై న సభ్యులకు పార్టీ గుర్తింపు కార్డులు అందజేస్తామని, వారికి మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ‘టాస్క్ ఫోర్స్’ బృందాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
45 రోజుల్లో కమిటీల పునర్నిర్మాణం పూర్తి కావాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు
గ్రామస్థాయి నుంచే పార్టీ పటిష్టత


