క్రీడలను ప్రోత్సహించేందుకు శ్రీకారం
● ఆసక్తిగల విద్యార్థులను గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు
పాలకొండ: క్రీడలను పోత్సహించడం ద్వారా గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులతో పాలకొండ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను గుర్తించి వారిని పోత్సహించేందుకు క్రీడా పాఠశాల కాన్సెప్ట్ అమలు చేయాలని సూచించారు. దీని ప్రకారం విద్యార్థులకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో గుర్తించి వారిని ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో క్రీడకు సంబంధించి ఒక్కో పాఠశాలను ఎంపిక చేయాలని సూచించారు. ఆ పాఠశాలలన్నింటికీ ఒకే తరహాలో అంతర్జాతీయ క్రీడా శిక్షణ అందించాల్సి ఉంటుందన్నారు. ఒకే క్రీడ ఆడే విద్యార్థులను ఒకే పాఠశాలకు చేర్చడం ద్వారా వారికి ఆ క్రీడలో శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆటల్లో శిక్షణతో పాటు వారికి ఆరోగ్యకరమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని క్రీడలకు ఒకే పాఠశాలలో శిక్షణ అందించడం కష్టంగా ఉన్న ఉపాధ్యాయులకు ఈ విధానం ద్వారా మంచి క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం కలుగుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ విధానం తక్షణం అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయనతో పాటు మండల ప్రత్యేకాధికారి ఎస్.మన్మథరావు, ఎంపీడీవో విజయరంగారావు, తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
పనికి వెళ్లకుండానే
మస్తర్లు
● మేట్‌లు, ఫీల్డు అసిస్టెంట్ కలిసి వేతనాల కై ంకర్యం
● ప్రశ్నిస్తే జాబ్‌కార్డులు తొలగిస్తామంటూ హెచ్చరిక
● ఎంపీడీఓకు వేతనదారుల ఫిర్యాదు
గుమ్మలక్ష్మీపురం: పనికి వెళ్లకుండానే మస్తర్లు వేస్తారు.. వారి ఖాతాల్లో వేతనాల రూపంలో జమైన డబ్బులను తీసుకుంటారు. మేట్‌లు, ఫీల్డు అసిస్టెంట్లు కలిసి ఉపాధిహామీ నిధులు కై ంకర్యం చేస్తున్నారు.. దీనిపై ప్రశ్నించిన వేతనదారుల జాబ్‌కార్డులు తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారని గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పంచాయతీ కోళ్లఫారానికి చెందిన వేతనదారులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలను వివరించారు. 32 మంది పనికి హాజరైతే 82 మంది హాజరైనట్టు మస్తర్లు నమోదు చేస్తున్నారని వేతనదారులు రవికుమార్, శ్రీధర్, చంద్రమ్మ, సునీత తదితరులు పేర్కొన్నారు. విచారణ జరిపి అక్రమాలను అడ్డుకోవాలని, సంబంధిత మేట్‌లు, ఫీల్డు అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.


