పరిష్కారానికి ఎన్నాళ్లో..!
కదిపితే కన్నీళ్లు..
ఈ దీనుల మొర ఎవరు ఆలకిస్తారు. వారి ఆవేదన ఎవరు పట్టించుకుంటారు. ఏ దేవుడు వారిని కరుణిస్తాడు. ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వారికి న్యాయం చేస్తారు. ఏదో సమస్యతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రాలు ఇస్తున్న అభాగ్యుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కన్నీళ్లు కారుస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం
ఎవరిని కదిపినా కన్నీళ్లే..ఆవేదనలే. పింఛన్లు కావాలని.. అన్యాయంగా విధుల నుంచి తొలగించారని..తమ స్థలాన్ని ఆక్రమించారని..రహదారులు వేయాలని..ఇలా ఒకటా, రెండా వందలకొద్దీ సమస్యలు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై ఎంతో నమ్మకంతో అర్జీలిచ్చేందుకు వస్తున్న వివిధ వర్గాల వారికి నిరాశే ఎదురవుతోంది. సుదూర ప్రాంతం నుంచి వచ్చి, కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉన్నతాధికారులకు వినతులిస్తున్నప్పటికీ అవన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. ప్రతి వారం వివిధ సమస్యలపై వందకుపైగా విజ్ఞప్తులొస్తున్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు..పరిష్కరించేసినట్లుగానే చెప్పుకుంటున్నారు. బాధితులు ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సైతం కాళ్లీడ్చుకుంటూ, మరొకరి సాయంతో పింఛన్ కోసం వస్తున్నారు. కొండలు దిగి వస్తున్నామని, తమ ప్రాంతానికి రహదారి వేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు. వారి కష్టం చూసైనా ప్రభుత్వ యంత్రాంగం మనసు కరగడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
పాచిపెంట మండలం కేసలి గ్రామానికి చెందిన కిర్ల శ్రీనివాసరావు కుమారుడు రితిక్ పుట్టుక నుంచి వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. వైద్యానికి, మందులకు అధిక మొత్తం ఖర్చవుతోంది. 84 శాతంతో పర్మినెంట్ డిజేబులిటీ ఉందని వైద్యులు కూడా ధ్రువీకరించారు. సుమారు రెండేళ్లుగా పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. పింఛన్ మొత్తం వస్తే మందుల ఖర్చయినా ఒడ్డెక్కుతుందని తండ్రి శ్రీనివాసరావు అంటున్నాడు. ఏ ఒక్కరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


