టీడీపీ పదవి..
సమయం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. కలెక్టరేట్ ఆవరణంతా వినతులిచ్చేందుకు వచ్చిన ప్రజలతో కిటకిటలాడుతోంది. అప్పుడే ప్రధాన గేటులో నుంచి.. కుయ్ కుయ్‌మని శబ్దం (సైరన్) చేసుకుంటూ నల్లరంగు కారు ఒకటి లోపలికి దూసుకొచ్చింది. వచ్చింది ఎవరా? అని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. కారు తిన్నగా వచ్చి కలెక్టరేట్ మెట్ల వద్ద ఆగింది. (సాధారణంగా కలెక్టరేట్, జేసీ వంటి ఉన్నతాధికారులు.. రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రి వంటివారు వచ్చినప్పుడే ఆ ప్రదేశంలో కారును నిలుపుచేస్తారు). అందులో నుంచి ఠీవీగా తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి దిగారు. అంతే.. ముక్కున వేలేసుకోవడం అందరి వంతైంది. సైరన్ మోగించే కారును కలెక్టర్, ఎస్పీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వంటివారు మాత్రమే వినియోగించాలి. కేబినెట్ హోదా ఉన్న మంత్రులకు కూడా పోలీస్ ఎస్కార్ట్ వాహనం, ప్రోటోకాల్ వాహనం ఈ విధమైన సైరన్ మోగించుకుంటూ ముందువెళ్తాయి. ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి వాహనాలను వినియోగించరు. అలాంటిది ఇటీవలే టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తేజోవతి.. ఏకంగా బుగ్గకారు బిల్డప్ ఇస్తూ.. సైరన్ మోగించుకుంటూ నేరుగా కలెక్టరేట్‌లోకే రావడం గమనార్హం. పార్టీ పదవికే ఈ విధమైన బిల్డప్ ఇస్తే.. భవిష్యత్తులో ఏదైనా రాజ్యాంగ పదవివస్తే... ఇంకెంత రేంజులో వస్తారో అని అక్కడున్న వారంతా చర్చించుకోవడం కనిపించింది.
– సాక్షి, పార్వతీపురం మన్యం


