
వెదురు కర్రలతో వంతెన
స్వచ్ఛందంగా ఏర్పాటుచేసుకున్న రైతులు
మక్కువ: మండలంలోని కొండరేజేరు, సీతానగరం మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం కాలువపై వెదురు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు పంటపొలాలకు వెళ్లాలన్నా కాలువ దాటి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే పార్వతీపురం పట్టణంలోని అస్పత్రికి వెళ్లాలన్నా, కాలువలో దిగి, నీటిని దాటుకుని వెళ్లాల్సి వస్తోంది. కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు సాగించలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మక్కువ మండలంలోని కొండరేజేరు, సీతానగరం మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.1.60లక్షలు మంజూరయ్యాయి. ఆ నిధులతో రెండు గ్రామాల మధ్య మెటల్‌రోడ్డు వేసి వదిలివేశారు. రెండు గ్రామాల మధ్యనున్న కాలువపై వంతెన నిర్మాణంకోసం మరో రూ.40లక్షల నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ వంతెన పనులు ప్రారంభంకాకపోవడంతో రెండు గ్రామాలకు చెందిన పలువురు రైతులు నడుంబిగించి వెదురు కర్రలతో తాత్కలికంగా వంతెన ఏర్పాటు చేసుకున్నారు.
పనులు పూర్తిచేయాలంటూ మంత్రికి విజ్ఞప్తి
కొండరేజేరు, బళ్లకృష్ణాపురం గ్రామాల మధ్య రహదారి పనులు నిలిచిపోవడం, వంతెన పనులు ప్రారంభంకాకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కాలువలో నుంచి సాగునీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని, సోషల్‌మీడియా ద్వారా మంత్రి సంధ్యారాణి, మండల టీడీపీ అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు, తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తిచేస్తూ ఆ రెండు గ్రామాల ప్రజలు సందేశాన్ని పంపించారు.

వెదురు కర్రలతో వంతెన