
మన్యం జిల్లాలో నత్తల దండు దాడి
బెంబేలెత్తుతున్న రైతులు
పంటలపై కోతులు, ఎలుకలు, మిడతలు ఆఖరికి చీమలు దాడిచేయడం చూశాం.. విన్నాం.. ఎప్పుడైనా నత్తలు దాడి చేయడం విన్నామా.. మన్యం జిల్లాలో ఇప్పుడిదే సమస్యగా మారింది. నత్తలు గుంపులు, గుంపులుగా దండెత్తుతున్నాయి. ఇళ్లు, వాకిళ్లతోపాటు పంటలపైనా దాడి చేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రావికర్రవలస, గంగిరేగువలస, గదబవలస తదితర ప్రాంతాల్లో బొప్పాయి, జామ, దొండ, చిక్కుడు, కాకర, బెండ, బీర తదితర ఉద్యాన పంటలను తినేసి గుల్లచేస్తున్నాయి.
పత్తి పంటకూ నష్టం చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక రైతులు అవస్థలు పడుతున్నారు. నత్తగుల్లలపై గడ్డ ఉప్పు చల్లుతున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జంఝావతి జలాశయం వరదనీటితోపాటు నత్తలు కొట్టుకొచ్చి ఉంటాయని రైతులు అనుమానిస్తుండగా, కేరళ నుంచి తీసుకొచ్చిన వక్క మొక్కలతోపాటు నత్తలు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం
రెండు, మూడు నెలలుగా ఇదే సమస్య
నేను ఎనిమిదెకరాల్లో జామ, బొప్పాయి, చామంతి సాగు చేశా. మే వరకు పంటలు బాగున్నాయి. జూన్‌లో వర్షాలు వచ్చిన తర్వాత నత్తల దాడి మొదలైంది. గతంలో మిడతలు, పురుగులు వచ్చేవి. కొంత మందు కొడితే పోయేవి. ఇప్పుడు కొత్తగా నత్తల దండు పంటలను బతకనివ్వడం లేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. నివారణ చర్యలు చేపట్టడంతోపాటు, రైతుకు నష్టపరిహారం అందించాలి. – సాయిబాబు, గంగురేగువలస, కొమరాడ మండలం
కేరళలో నత్తల దాడి అధికం
పంటలపై నత్తలు దాడి చేయడం కేరళలో ఎక్కువగా జరుగుతుంది. చిత్తడి నేల, నీడ ఉన్నచోట ఇవి ఎక్కువగా ఉంటాయి. సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఇవి అధికంగా గుడ్లు పెడతాయి. కేరళ నుంచి తీసుకొచ్చిన వక్క మొక్కలతోపాటు నత్త లార్వాలు వచ్చి వృద్ధి చెందాయి. అందుకే నత్తల సమస్య ఉత్పన్నమైంది. పంటల మధ్య దూరం ఉండి ఎండ బాగా తగిలితే నత్తల లార్వాలు బతకజాలవు. తుప్పలను ఎప్పటికప్పుడు తీసివేసి భూమిని చదును చేయాలి. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – కె.సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, పార్వతీపురం మన్యం