అమ్మోరి ఆగ్రహం.. చిరుద్యోగుల విలాపం! | - | Sakshi
Sakshi News home page

అమ్మోరి ఆగ్రహం.. చిరుద్యోగుల విలాపం!

Aug 24 2025 8:33 AM | Updated on Aug 24 2025 8:33 AM

అమ్మోరి ఆగ్రహం.. చిరుద్యోగుల విలాపం!

అమ్మోరి ఆగ్రహం.. చిరుద్యోగుల విలాపం!

అమ్మోరి ఆగ్రహం.. చిరుద్యోగుల విలాపం!

పార్టీ కార్యక్రమంలో

పాల్గొనకపోయినా అంతే..

సాక్షి, పార్వతీపురం మన్యం: ఆ అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఎటువంటి వారు అయినా మాడిమసి అయిపోవాల్సిందే. అటువంటిది ఏదో చిన్న ఉద్యోగం.. గ్రామస్థాయిలో అలా పై అధికారులు, చోటా నాయకులు చెప్పింది తలూపుకొంటూ చేసుకొని పోయే వారిపై కన్నెర్ర చేస్తే.. ఇంకేమైనా ఉంటుందా.. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు.. ఆ నియోజకవర్గంలో ఉన్న తమ్ముళ్ల గ్రూపుల గోల.. ఆ ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు లోలోపల కుమిలిపోతున్నారు. ఉద్యోగులపై ఇదెక్కడి పెత్తనం అంటూ ఆవేదన చెందుతున్నారు.

కరవమంటే కప్పకు కోపం..

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా ఉంది ఇక్కడి పరిస్థితి. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కొలువై ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ తమ్ముళ్లు గ్రూపులు కట్టేశారు. ఒకరంటే ఒకరికి పడదాయె. ఒకరి పేరు చెబితే.. ఇంకొకరు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఇటీవల అమ్మవారి సొంత మండలంలోనే కొత్తగా మంజూరైన పింఛన్లను ఓ ఇద్దరికి సచివాలయ ఉద్యోగి పంపిణీ చేశారు. అనధికార ప్రోటోకాల్‌ ప్రకారం.. అక్కడ స్థానిక టీడీపీ నాయకుడికి పాపం ఆ ఉద్యోగి చెప్పి.. తన ధర్మం తాను నిర్వర్తించాడు. ఇదే.. అధికార పార్టీలోని మరో వర్గం ‘తమ్ముడికి’ కోపం తెప్పించింది. తనను ఏం పిలవలేదని ఫోన్‌ చేసి మరీ చెడామెడా ఆ ఉద్యోగికి వాయించేశాడు. తాను ఇక్కడ విధుల్లో చేరి రెండు రోజులే అయ్యిందని సదరు ఉద్యోగి చెప్పినా వినడాయే..! ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానంటూ బెదిరించాడు. మరోసారి నియోజకవర్గ కేంద్రానికి సమీప మండలంలోని ఓ గ్రామంలో నెలవారీ సరకుల పంపిణీకి తనను పిలవడం లేదని.. అంగన్‌వాడీ కార్యకర్తపై మరో ‘తమ్ముడు’ చిర్రుబుర్రులాడాడు. నేరుగా ఆ అమ్మవారి పేరు చెప్పే బెదిరించాడు. విషయం బయటకు వచ్చిందని.. ఆమె ఉద్యోగం తీసేసేందుకు అన్ని అస్త్రాలూ ఉపయోగించారు. వీటి అన్నింటి వెనుక.. అమ్మవారి అభయం ఉందనే తేలుతోంది.

వారి గ్రూపులు.. వీరి మెడకు

చుట్టుకుంటున్నాయి..

అమ్మవారి పుణ్యమానీ.. నియోజకవర్గంలో గ్రూపుల గోల తీవ్ర స్థాయిలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి మండలంలోనూ తనకంటూ ఓ వర్గాన్ని ఆమె ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. సొంత పార్టీలోనే కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ఇది కాస్త స్థానిక ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. రెండు వర్గాల పెత్తనంతో నలిగిపోతున్నారు. పొరపాటున అమ్మవారి వర్గానికి ఏ విషయంలోనైనా వ్యతిరేకంగా పరిణామాలు జరిగితే.. వీరిపై బదిలీవేటే. ఈ నియోజకవర్గంలో మహ‘రాణి’ పెత్తనం కింద బానిసల్లా బతకలేక ఉద్యోగులు నలిగిపోతున్నారు. బానిస సంకెళ్లు తెంచుకునే రోజుకోసం ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.

పాపం.. ఆరు నెలల కిందట ఓ ‘పెద్ద’పంచాయతీకి ఆ కార్యదర్శి బదిలీపై వచ్చాడు. అందరితో ఆయన ‘పథం’ బాగానే కలిసి సాగేది. దాదాపు ఉద్యోగుల బదిలీలు అన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. తాము కోరుకున్న వారినే మరీ తమ్ముళ్లు తెచ్చుకున్నారు. ఒక విషయం మాత్రం ఆ కార్యదర్శితో చెడింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అధికారికమైనది. ప్రభుత్వ పరంగా నిర్వహించడం వల్ల అధికారులంతా హాజరయ్యేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పూర్తిగా పార్టీకి సంబంధించినది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి హాజరైన దాఖలాలు లేవు. ఈ పంచాయతీలో సదర కార్యదర్శి హాజరు కాలేదని అమ్మవారు కోపద్రిక్తులయ్యారు. ఏకంగా సరెండర్‌ చేసి పడేశారు. ఆ ఉద్యోగి సంజాయిషీ ప్రయత్నిస్తే.. ‘సస్పెండ్‌ చేయలేదు కదా సంతోషించు’ అంటూ అమ్మవారు సెలవివ్వడం గమనార్హం. ‘కొత్త’గా ఉంటుందని మరో కార్యదర్శి ఆ పంచాయతీకి ‘వలస’ వచ్చాడు. అక్కడ కూడా పెన్షన్లను టీడీపీలోని వేరే వర్గం వారిని పిలిచి పంపిణీ చేశారని.. మరో వర్గానికి చెందిన అదే పార్టీ నాయకుడు సర్పంచ్‌, కార్యదర్శికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు. ఈ పంచాయితీ కాస్త అమ్మవారి దగ్గరికి వెళ్లడంతో.. వచ్చిన ఏడాది కాలంలోనే ఆ పంచాయతీ నుంచి కార్యదర్శిని బదిలీపై పంపించేశారు. ఉద్యోగాలను నమ్మి.. కుటుంబాలను తీసుకొచ్చేస్తున్నామని.. ఎన్ని రోజులు ఉంటామో తెలియని పరిస్థితి ఎదురవుతోందని ఆయన వాపోతున్నాడు.

పింఛన్ల పంపిణీకి పిలవలేదని తమ్ముడి ఫిర్యాదు

కార్యదర్శిపై బదిలీ వేటు?

పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదని మరో కార్యదర్శికి సరెండర్‌ శిక్ష

తమ్ముళ్ల పెత్తనంతో నలిగిపోతున్న ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement