
జీవో ఇచ్చారు.. డబ్బులు మరిచారు..!
రాష్ట్ర ప్రభుత్వ సాయం అందలేదు
అదనపు సాయం రావాల్సి ఉంది
సీతంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా ఉంది... కూటమి ప్రభుత్వం తీరు. పీఎం జన్‌మన్ హౌసింగ్ స్కీమ్‌కు కేంద్రం నిధులు సమకూర్చుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న అదనపు సాయం చేయడంలో మొండిచేయి చూపుతోంది. లబ్ధిదారులను వేదనకు గురిచేస్తోంది. గృహ నిర్మాణదారులను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తోంది. పేదలకు పక్కాఇంటి భాగ్యాన్ని దూరం చేస్తోంది.
ఇదీ పరిస్థితి...
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పక్కా గృహాలు లేని పీవీటీజీ (పర్టికులర్లీ వాలనర్‌బుల్ ట్రైబ్‌గ్రూప్)లకు ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీఎం జన్‌మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.2.39 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిని మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అదనంగా రూ.లక్ష మంజూరు చేస్తామని ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 10వ తేదీన జీఓ కూడా జారీ చేసింది. గిరిజనులు సంతోషించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక ఊతం లభిస్తుందని ఆశపడ్డారు. 9 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1749 ఇళ్లు మంజూరయ్యాయి. కేవలం 42 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులు పూర్తి చేశారు. 901 ఇళ్లు పునాద దశలోను, మరో 400 రూఫ్ లెవెల్‌లో ఉన్నాయి. 94 మంది స్లాబ్‌లు వేయగా, 452 మంది ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. ఒక్కో ఇంటికి పునాదులు వరకు నిర్మిస్తే రూ.70 వేలు, రూఫ్ స్థాయిలో 90 వేలు, స్లాబ్ నిర్మిస్తే 40 వేలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు చెల్తిస్తారు.
బిల్లుల చెల్లింపులో అలసత్వం తగదు. ఇస్తామన్న ఆర్థిక సాయం నెలలు గడుస్తున్నా అందలేదు. ప్రభుత్వం స్పందించి జీవో ప్రాప్తికి నిధులు విడుదల చేయాలి.
– నిమ్మక అరుణ, టిటుకుపాయి సర్పంచ్
పీఎం జనమన్ ఇంటి నిర్మాణానికి అష్టకష్టాలు పడుతున్నాం. పునాదులు, రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మించిన వారికి బిల్లులు ఇచ్చారు. అదనపు సాయం అందిస్తే త్వరితగతిన ఇంటిని నిర్మించుకుంటాం. ఇప్పటి వరకు కొంతమందికి రెండువిడతల్లోని నిధులు జమయ్యాయి. ఆ నిధులు ఎటూ సరిపోవడం లేదు.
– ఎస్.లక్ష్మి, హౌసింగ్ లబ్ధిదారు, ద్వారబందం
పీఎంజన్‌మన్ కింద తలపెట్టిన గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం కోసం జీవో ఇచ్చింది. నిధులు విడుదల కావాల్సి ఉంది. వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమచేస్తాం.
– సీహెచ్ వెంకటేష్,
హౌసింగ్ ఏఈ, సీతంపేట
పీఎం జన్‌మన్ పథకానికి కూటమి తూట్లు
పేదల గూళ్లకు నిధులు విదల్చని వైనం
గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.లక్ష ప్రోత్సాహం ప్రకటించి మిన్నకున్న ప్రభుత్వం
జీవో జారీచేసి 9 నెలలైనా విడుదల కాని నిధులు
అదనపు సాయం కోసం ఎదురుచూపు
ఆర్థిక ఇబ్బందుల్లో గిరిజనులు
ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు