
ఎవరు చేశారీ పని?
● కలెక్టరేట్ పేరుతో ఉన్న అక్షరాలను తొలగించే ప్రయత్నం
పార్వతీపురం రూరల్: కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఉన్న బోర్డులో కలెక్టర్ కార్యాలయం అని సూచించే పదాల అచ్చులను గుర్తుతెలియని అకతాయిలు బుధవారం రాత్రి తొలగించారు. ఈ క్రమంలో కొన్ని పదాలకు సంబంధించిన అక్షరాలు బోర్డులో గురువారం ఉదయం లేకపోవడాన్ని సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ మేరకు డీఆర్‌ఓ కె.హేమలత, ఈ చర్యలను తీవ్రంగా పరిగణించి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా, సీఐ కె.మురళీధర్ పరిశీలించి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అత్తారింటి వేధింపులపై
కేసు నమోదు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలసలో ఉన్న విజయరామరాజు కాలనీకి చెందిన ఓ వివాహిత భర్తతో పాటు అత్తమామలపై వేధింపుల కేసు పెట్టింది. నిత్యం తనను వేధిస్తూ అధిక కట్నం కోసం డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు.
వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
● ఎస్సై ఎం.వెంకటరమణ
మక్కువ: ఈనెల 27వతేదీ నుంచి భక్తులు జరుపుకోనున్న వినాయకచవితి పండగ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటుచేయునున్న వినాయక మంటపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్సై ఎం.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో మంటపాలు ఏర్పాటుచేయనున్న భక్తులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలపాలన్నారు. మంటపాల వద్ద డీజేలకు అనుమతిలేదన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బాణాసంచా కాల్చరాదని, గ్రామాల్లో ఎటువంటి గొడవలుకు తావులేకుండా ప్రశాంతవాతావరణంలో వినాయకచవితి పండగను భక్తులు జరుపుకోవాలని కోరారు. ఏవిధమైన సంఘటనలకు పాల్పడినా కమిటీసభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ఎవరు చేశారీ పని?