
రైతు వ్యతిరేకి కూటమి సర్కార్
● ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం
● ఎమ్మెల్సీ పాలవలస మండిపాటు
వంగర: రాష్ట్రంలో కూటమి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన మండల కేంద్రం వంగరలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామంటున్న సీఎం చంద్రబాబు చేతల్లో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఏ గ్రామంలో చూసినా ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, యూరియా, డీఏపీ కొరత రైతన్నలను కలవరపెడుతోందన్నారు. రైతులు అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎన్నడూ ఎరువుల కొరత లేదన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు ముందుగానే రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు తరలించి పూర్తిస్థాయిలో అన్నదాతకు ఎరువులను సరఫరా చేసే ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రైతుల పట్ల జగన్‌మోహన్‌రెడ్డి అనుసరించిన విధానాలు దేశానికే ఆదర్శమన్నారు. ఈ ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తున్న ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొనడమే కూటమి సర్కారు పనితీరుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేదని, ఇప్పుడు రైతు చెల్లించుకోవడమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అన్ని వర్గాలకూ మోసం
వంగర మండలంలోని శివారు గ్రామాలకు తోటపల్లి సాగునీరు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్నారు. రైతులు, పింఛన్ లబ్దిదారులు, వికలాంగులు, యువత, విద్యార్ధులు, ఉద్యోగులను చంద్రబాబు సర్కారు మోసం చేస్తోందంటూ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కేంద్రంలో ప్రగల్భాలు పలుకుతున్న నేతలకు ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ ఉత్తారావెల్లి సురేష్‌ముఖర్జీ, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, ఎంపీటీసీ కనగల పద్మ, సర్పంచ్ పోలిరెడ్డి రమేష్, పార్టీ నాయకులు బొక్కేల వెంకటప్పలనాయుడు, కాంబోతుల శ్రీనివాస నాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, పెంకి సంపత్‌కుమార్, కాంబోతుల రాము, గొండేల తవిటయ్య మాస్టారు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.