
బోల్తా పడిన లారీ
బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామం వద్ద జాతీయ రహదారి 26పై మానాపురం నుంచి విజయనగరం వస్తున్న లారీ అదుపుతప్పి పంట పొలాల్లో బుధవారం బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని లారీని బయటకు తీసే చర్యలు చేపట్టారు.
15 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్
కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్ పరిధి జి.శివడ పంచాయతీ పెద్దఅంటిజోల గ్రామసమీపంలో అక్రమంగా సారా విక్రయిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు బుధవారం నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లీటర్ల సారాను ఓ వ్యక్తి కలిగి ఉండడంతో సారా స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా సారా వంటకాలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజృంభిస్తున్న జ్వరాలు
● మంచం పడుతున్న ప్రజలు
సాలూరు: వర్షాలు తెరిపిచ్చిన క్రమంలో నియోజకవర్గంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వైరల్, మలేరియా, టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గిరిశిఖర దొర్లతాడివలస, జాకరవలస, మూలతాడివలస, కుంబిమడ తదితర గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. తీవ్రజ్వరాలతో బాధపడుతున్నా మెడికల్ క్యాంపులు నిర్వహించకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న దొర్లతాడివలసకు చెందిన మధుసూదనరావును విజయనగరం ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో సుమారు ఏడాది కాలానికి పైగా ఏసీఎం ద్రావణం పిచికారీ చేయలేదని గిరిజనులు అంటున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో దోమలు అధికమయ్యాయని, ఫలితంగా జ్వరాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో వైద్యశిబిరం ఏర్పాటు
గిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ స్పందించి వెంటనే వైద్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేయడంతో దొర్లతాడివలసలో బుధవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దొర్లతాడివలస, జాకరవలసకు చెందిన 44 మందికి వైద్యపరీక్షలు చేసి మెరుగైన చికిత్స నిమిత్తం పలువురిని తోణాం పీహెచ్‌సీకి తరలించారు.
శ్రీకాకుళం రూరల్: ఏపీస్టేట్ ఎలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ సెక్రటరీ వారు డిప్లమో ఎలైడ్ హెల్త్ కేర్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాగోలు జెమ్స్ ఆస్పత్రిలోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్‌లో ఏ గ్రూప్‌లో పాస్ అయిన విద్యార్థులైనా అర్హులేనని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలని కోరారు.
నూతనబార్ పాలసీ
విధానంలో ఫీజుల తగ్గింపు
విజయనగరం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ విధానంలో లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించినట్లు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత బార్ పాలసీ విధానంతో పోల్చితే లైసెన్స్ దారుడికి అనేక రాయితీలు లభిస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో దరఖాస్తు విధానంతో పాటు ఒక వ్యక్తికి ఒకటికి మించి బార్లు కేటాయింపు, ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకూ బార్ పనివేళలు ఉంటాయన్నారు. ఆరు వాయిదాల్లో లైసెన్స్ పీజు చెల్లింపు చేసుకోవచ్చని, ఐఎమ్‌ఎల్, బీర్ అమ్మకాలు జరిగిన తదుపరి రెండు నెలల తర్వాత చెల్లింపులు చేయవచ్చన్నారు.

బోల్తా పడిన లారీ