
పడాలవలస గిరిజనుల తాగునీటి కష్టాలు
● పట్టించుకోని కార్యదర్శి
● పంటపొలాల నుంచి తాగునీరు సేకరణ
సాలూరు రూరల్:
ఎక్కడైనా మండు వేసవిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి కోసం అవస్థలు పడుతున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. అయితే సాలూరు మండలంలోని మరిపల్లి పంచాయతీ పడాలవలస గిరిజన గ్రామ ప్రజలు వర్షాకాలంలో కూడా గడిచిన 10 రోజులుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని బోరుబావి మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.
దీంతో పక్కనే ఉన్న పంటపొలాల్లో బోరు బావినుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నందున తెల్ల వారేసరికి వ్యవసాయ పనులకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తాగునీటి కోసం కొంత సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంటోందని గిరిజన మహిళలు వాపోతున్నారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శికి సమస్యను వివరించినప్పటికీ తాను చేసేది ఏమీ లేదని నాయకులను కలవాలని చెబుతున్నట్లు గ్రామస్తులు వివరించారు. ఈ క్రమంలో ఎలాగోలా బోరు బావికి మరమ్మతులు చేయాలని బుధవారం గ్రామంలోని కొంతమంది యువకులు ప్రయంత్నించి పైపులు బయటకు తీశారు. అయితే బోరు మరమ్మతులకు కొన్ని కొత్త సామగ్రి అవసరమవుతాయని గుర్తించిన యువకులు ఆ డబ్బులు ఎవరు పెడతారని, ఎక్కువ ఖర్చు అయితే అంత సొమ్ము ఎవరు భరిస్తారని చర్చించుకుని తాము పని విషయంలో సహకరిస్తామే తప్ప డబ్బులు పెట్టే స్థోమత తమకు లేదని ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య అలాగే ఉండి పోయింది. వెంటనే గ్రామ కార్యదర్శి బోరు బావికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పడాలవలస గిరిజనుల తాగునీటి కష్టాలు