
అంతరాలను తగ్గించేందుకే ఆది కర్మ యోగి
పార్వతీపురం: గిరిజనుల్లో అంతరాలను తగ్గించేందుకే ఆది కర్మ యోగి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఆది కర్మ యోగి కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో పాలన, సేవలను అమలు చేసేందుకు శిక్షణ పొందిన కార్యకర్తలను నియమించ నున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ భాగస్వామ్యంతో సాధికారత కల్పించే లక్ష్యంతో ఆది కర్మ యోగి సిద్ధాంతం అమలు చేయనున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధిలో అంతరాలను తగ్గించేందుకు ఆది కర్మ యోగి కార్యక్రమం ద్వారా చర్యలు చేపడతామన్నారు. గిరిజన భాషలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో అభివృద్ధిని ప్రోత్సహించనున్నామని చెప్పారు. రాష్ట్రస్థాయి శిక్షకుడిగా ఎంపికై న ఐటీడీఏ ఏపీఓ మరళీధర్ పర్యవేక్షణలో జిల్లాలో రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంద్వారా జిల్లాలో 500 మందికిపైగా జనాభా ఉన్న 165 గ్రామాలకు చెందిన 83వేల గిరిజనులు ప్రయోజనం పొందుతారన్నారు. 2047 నాటికి సంతృప్త మోడ్‌లో గ్రామాల్లోని అంతరాలను తీర్చడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయ పడ్డారు.