విజయనగరం ఫోర్ట్: వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. నిన్న మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోయాయి. గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అధికశాతం పంటల సాగు వర్షాధారంగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో పంటలు పండేవరకు నమ్మలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పంటల బీమా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కూటమి సర్కార్ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు సంక్షేమానికి పాటు పడతామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైతులకు మేలు చేయడం మాట దేవుడెరుగు. ఉన్న ఉచిత పంటల బీమా పథకానికే కూటమి సర్కార్ చేతులెత్తేసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లింపు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. రైతు పంటలు సాగు చేసి ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలు. ఈక్రాప్ అధారంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించేది. పంటనష్టం జరిగితే బీమా పరిహారాన్ని కూడా సకాలంలో చెల్లించింది.
గత ఏడాది రబీనుంచి రైతులదే బీమా చెల్లింపు
గత ఏడాది రబీ నుంచి రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలని కూటమి సర్కార్ చెప్పేసింది. దీంతో రైతులు రబీసీజన్‌లో అపరాలకు, మొక్కజొన్నకు పంటల బీమా ప్రీమియం చెల్లించారు.
పంటల బీమాకు రైతులు దూరం
ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంటల బీమాకు దూరంగా ఉన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి రావడంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడం లేదు. లక్షలాది మంది రైతులు ఉన్నప్పటికీ కేవలం 295 దరఖాస్తులే పంటల బీమా కోసం వచ్చాయి. వరి పంటకు ఎకరాకి రూ.200, మొక్కజొన్నకు రూ.165 నువ్వు పంటకు రూ.65 చొప్పన ప్రీమియం చెల్లించాలి.
ప్రీమియం చెల్లించడానికి
ముందుకు రాని రైతులు
పంటల బీమాకు కేవలం 295 దరఖాస్తులు
ముగిసిన గడువు
ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ మంగళం
రైతుకు లేని బీమా ధీమా