న్యూస్‌రీల్
ఎరువుల కొరత లేకుండా చూడాలి ఎకరా ఉన్నా, పది ఎకరాలున్నా ఒక బస్తా ఇస్తే ఎలా సరిపోతుంది అర్హుల పింఛన్లు పునరుద్ధరించాలి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ఆధారం తీసేయొద్దు
పాలకొండ: మండలంలోని నాగావళి నదీ తీరంలో అక్రమంగా సాగుతున్న ఇసుక క్వారీలపై సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ చర్యలు చేపట్టారు. మంగళాపురంలోని ఇసుక ర్యాంపును ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సయంలో అక్కడ ఒక జేసీబీ, ఇసుక లారీని గుర్తించి వెంటనే సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతు లు లేకుండా ఇసుక తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టిసారించాలని తహసీల్దార్ రాధాకృష్ణమూర్తిని ఆదేశించారు. సీజ్ చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించాలన్నారు.
కొమరాడ: నాగవళి నదిపై పూర్ణపాడు–లాబేసు వంతెన నిర్మాణం జరగకపోవడంతో కొమరాడ మండల కేంద్రం ఆవలవైపు ఉన్న తొమ్మిది పంచాయతీల ప్రజలకు పడవ ప్రయాణం తప్పడం లేదు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనూ బుధవారం పడవ ప్రయాణాలు సాగాయి. 2006లో అప్ప టి ప్రభుత్వం సమకూర్చిన మరబోటులోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బోటు మరమ్మతులకు నిధులు అందించాలని బోటు నిర్వాహకులు కోరుతున్నారు.
పార్వతీపురం రూరల్: జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులతో కలెక్టర్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనుమానం ఉండే ప్రదేశాల్లో నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: గురజాడ కళాభారతిలో ప్రబోధసేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు బుధవారం జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల భజనలు, కోలాట ప్రదర్శనలు, చిన్నారుల వేషధారణల నడుమ స్వామివారి విగ్రహాన్ని తిరువీధి జరిపారు. సర్వమానవాళికి భగవంతుడు శ్రీకృష్ణుడని భక్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ ఇఫ్కో డైరెక్టర్ కె.బంగార్రాజు, సమితి ప్రతినిధులు నాయుడు, ప్రసాద్, వంశీ, వెంకి, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరాలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తం చెల్లించడంతో పాటు అవసరం లేని కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు. జిల్లా పరిషత్‌లో 1–7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన బుధవారం జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూరియా కొరత ఉందని, రైతులు ఇబ్బంది పడుతున్నారని సభ్యులు తెలిపారు. ఎకరా ఉన్న రైతుకు, 10 ఎకరాలు ఉన్న రైతుకి ఒకటే యూరి యా బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు జిల్లాలు వ్యవసాయ శాఖ జేడీలు మాట్లాడుతూ రెండు రోజుల్లో యూరియా వస్తుందని తెలిపారు.
●ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతూ, అర్హత ఉన్న దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి పింఛన్లు రద్దు చేయడం అన్యాయమని పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు. మక్కువ, గజపతినగరం మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు మావుడి శ్రీనివాసరావు, గార తవుడు అర్హులకు జరిగిన అన్యాయంపై డీఆర్‌డీఏ పీడీ దృష్టికి వివరాలతో తీసుకెళ్లారు. పింఛన్ల రద్దును నిలిపివేయాలని కోరారు. దీనిపై జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అర్హతలేని వారికి పింఛన్ నిలిపివేసినా అర్థం ఉంటుందని, ఎక్కువ శాతం దివ్యాంగత్వం ఉన్న వారికి పింఛన్లు నిలిపివేయడం తగదని, తక్షణమే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
●జిల్లాలో రైతాంగానికి అవసరమైన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో జాప్యంపై చైర్మన్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సకాలంలో విద్యుత్ కనెక్షన్లు జారీచేయకపోతే రైతులు పంటలను ఎలా సాగుచేస్తారన్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఉమ్మడి జిల్లాలకు చెందిన అధికారులు, వైస్ చైర్మన్ మరిసర్ల బాపూజీనాయుడు, సభ్యులు కె.సింహాచలం, సంకిలి శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ఎరువుల కొరతపై సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి, రైతులు
పాలకొండ: వీరఘట్టం మండలంలో ఎరువులు రైతులకు అందకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. పాలకొండ, వీరఘట్టం మండలాల రైతులతో కలిసి ఎరువుల కొరతను సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి నాయకులకు మాత్రమే ఎరువులు అందిస్తున్నారని, మిగిలిన రైతులు ఎరువుల కోసం అవస్థలు పడుతున్నారని తెలిపారు.
పాలకొండ డివిజన్‌లో కొంతమంది అధికారులు ప్రోటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌లకు ఎటువంటి సమాచారం లేకుండా గ్రామాల్లో పనులు చేస్తున్నారని వివరించారు. దీనిపై సబ్‌కలెక్టర్ స్పందిస్తూ అన్ని శాఖల అధికారులకు పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇచ్చేలా ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు దమలపాటి వెంకటరమణనాయుడు, కనసాక సూర్యప్రకాష్‌రావు, కోట అజయ్‌కుమార్, నల్లి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
చాలా మంది దివ్యాంగులు పింఛన్ డబ్బులే ఆధారంగా జీవిస్తున్నారు. వైద్యులు దివ్యాంగుల దివ్వాంగత్వాన్ని నిర్ధారించి ఇచ్చిన సదరం ధ్రువపత్రంతోనే ఏళ్ల తరబడి పింఛన్ అందుకుంటున్నారు. ఇప్పుడు రీ సర్వే పేరుతో వారికి నోటీసులు ఇవ్వడం తగదు. అర్హత ఉన్నవారి పింఛన్లు రద్దుచేయొద్దు. నోటీసులతో భయపెట్టడం సరికాదు. మా నెల్లిమర్ల ప్రాంతంలో కూడా చాలామంది దివ్యాంగులకు నోటీసులు అందడంతో ఆందోళన చెందుతున్నారు. సమస్యను అధికారులు పరిష్కరించాలి. – పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ

పార్వతీపురం మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా