
ఏసీబీ వలలో వీఆర్‌వో
వేపాడ: మండలంలోని శింగరాయి వీఆర్‌వో కె.సత్యవతి ఏసీబీ వలకు చిక్కారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య అందించిన వివరాలు.. తన రెవెన్యూ పరిధిలో ఒక రైతు అనుభవంలో ఉన్న శింగరాయి, గుడివాడ భూములకు ముటేషన్ దరఖాస్తు చేశారు. ఇందుకోసం వీఆర్‌వో సత్యవతి సంబంధిత రైతు నుంచి రూ.లక్షా 70వేలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం సాయంత్రం వేపాడ సమీపంలో కళ్లాల వద్ద ఫిర్యాదుదారి నుంచి రూ.లక్ష నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అక్కడ నుంచి వీఆర్‌వోను వేపాడ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వీఆర్‌వో సత్యవతి విధులు నిర్వహిస్తున్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను కంప్యూటర్లలో పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్‌ఐ వాసు నారాయణ, సిబ్బంది, మహిళా పోలీసులు, ఆర్‌ఐ రామలక్ష్మి పాల్గొన్నారు.