
కురుపాం ఆశ్రమ పాఠశాలలో వారం వ్యవధిలోనే ఇద్దరు బాలికల మృతి
పచ్చకామెర్లు, విష జ్వరాల విజృంభణ
వంద మందికి పైగా బాలికలకు అనారోగ్యం
పార్వతీపురం జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్‌ల్లో చికిత్స
ఐసీయూలో ముగ్గురు బాలికలు
సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం: విద్యార్థుల మరణ మృదంగంతో మన్యం విలవిల్లాడుతోంది. పచ్చకామెర్లు, విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను కలవరపెడుతున్నాయి. గిరిజన బాలలను కబళిస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. వంద మందికిపైగా విద్యార్థులు కామెర్లు, జ్వరాలతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్‌ల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులే కావడం గమనార్హం. జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం–నీరు, వైద్యసదుపాయాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జ్వరాలు, పచ్చకామెర్లు ప్రబలాయనే వాదన బలంగా వినిపిస్తోంది. గత జులై నుంచి ప్రస్తుత అక్టోబరు వరకు జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడం గమనార్హం.
తాగునీటి కలుషితం వల్లేనా?
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో 934 మంది విద్యార్థులు ఉండగా, నాలుగైదు రోజుల్లోనే 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. తాగునీటి కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మందిలో పచ్చకామెర్లు లక్షణాలు బయటపడటంతో శనివారం పాఠశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 79 మంది ఉన్నారు. విశాఖ కేజీహెచ్‌లో ముగ్గురు ఐసీయూలోనూ, 34 మంది జనరల్ వార్డులోనూ చికిత్స పొందుతున్నారు.
మిగిలిన నలుగురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కామెర్ల బారిన పడిన విద్యార్థినుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి గత నెల 26న, కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన ఈ నెల 1న మృతి చెందారు. వారంలోనే ఇద్దరు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హడావిడిగా రక్త పరీక్షలు జరిపి, మిగిలిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల బాధితుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి నాలుగు రోజుల క్రితం పాఠశాలను సందర్శించి, ఆర్వో ప్లాంట్ సమస్యపై అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు హడావిడిగా కొత్త ప్లాంట్‌ని ఏర్పాటు చేశారు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
మన్యం జిల్లాలో గిరిజన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. గత ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు 11 మంది ఆశ్రమ, సంక్షేమ పాఠశాలల విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరంతా అనారోగ్యానికి గురి కావడం.. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతోనే ప్రాణాలు వదిలారు. తాము అధికారంలోకి వస్తే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం చేపడతామని చెప్పిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇప్పటివరకు అమలుకునోచుకోలేదు. ఆమె సొంత జిల్లాలోనే గిరిజన విద్యార్థులు విషజ్వరాలు, పచ్చకామెర్ల బారిన పడినా ఇప్పటివరకు పట్టించుకోలేదు.
తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హడా వుడిగా మేల్కొన్న ఆమె విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కూడా ఇప్పటి వరకు విద్యార్థుల పరిస్థితిపై స్పందించకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని రెండు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లకు రెగ్యులర్ పీవోలు లేరు. పార్వతీపురం ఐటీడీఏ డీడీ కూడా ఇన్‌చార్జే కావడంతో ఆశ్రమ పాఠశాలలు అధ్వానంగా మారాయని విమర్శిస్తున్నారు.
భయం వేస్తోంది..
గురుకుల పాఠశాలకు పిల్లలను పంపాలంటేనే భయం వేస్తోంది. నా ఇద్దరు కుమార్తెలు గురుకులంలో ఒకరు పదో తరగతి, ఇంకొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రక్త పరీక్షలు చేసేందుకు తీసుకొచ్చాను. ఇప్పటికే ఇక్కడ ఇద్దరు చనిపోవడంతో భయంగా ఉంది. – బిడ్డిక నాగరాజు, సంగెడ్డ గ్రామం, కురుపాం మండలం, విద్యార్థిని తండ్రి
సౌకర్యాలు లేవు
ఉన్నత చదువుల కోసం చేర్పిస్తే.. విగతజీవిగా ఇంటికి వస్తున్నారు. పాఠశాలలో వందల మంది పిల్లలకు వసతులు, మరుగుదొడ్లు సరిగా లేవు. కలుషిత నీరో, లేక కలుíÙత ఆహారమో తెలియదు. పచ్చకామెర్ల బారిన పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువైంది. – మండంగి కృష్ణ, లాబేసు గ్రామం, కొమరాడ మండలం, విద్యార్థిని తండ్రి
విద్యార్థులందరికీ రక్త పరీక్షలు
విద్యార్థులందరికీ రక్తపరీక్షలు నిర్వహించాం. నివేదికలు ఇంకా రాలేదు. జ్వరాలు, పచ్చకామెర్ల అనుమానిత లక్షణాలు ఉంటే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నాం. ముందు జాగ్రత్తగా కురుపాం మండలంలోని శివన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వారం రోజుల పాటు సెలవులను ప్రకటించాం. – డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్, పార్వతీపురం మన్యం
సమగ్ర విచారణ జరిపిస్తున్నాం..
బాధిత విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాధుల విజృంభణపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు సమగ్ర విచారణ జరిపి, నివేదికలు సమరి్పస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎం.గౌతమి, గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి