కరుణించు.. కనక మహాలక్ష్మి
● వేడుకగా ప్రారంభమైన అమ్మవారి జాతర
● తెల్లవారుఝాము 1.30 గంటల నుంచే ప్రారంభమైన దర్శనాలు
● పోటెత్తిన భక్తులు
చీపురుపల్లి: కరుణించి.. కాపాడు కనకమహాలక్ష్మీ అంటూ భక్తులు ప్రణమిల్లారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుఝాము 1.30 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కుటుంబ సమేతంగా తొలి పూజలు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు రూ.100, రూ.50, రూ.20 క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో పాటు ఉచిత దర్శనం క్యూలైన్లు మధ్యాహ్నం 1.30 గంటలు వరకు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు రావి చెట్టు, ధ్వజస్తంభంతో పాటు అమ్మవారి రాతి విగ్రహం వద్ద పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. అదేవిధంగా కోళ్లు, గొర్రెపోతులతో మొక్కులు చెల్లించుకున్నారు.
వీఐపీ క్యూలైన్‌లో సాధారణ భక్తులు..
జాతరలో భక్తులకు అవస్థలు తప్పలేదు. రూ.100, రూ.50, రూ.20 దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసుకుని దర్శనానికి వెళ్లినవారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వీఐపీల పేరుతో ఏర్పాటు చేసిన మార్గం మొత్తం సాధారణ భక్తులతో కిటకిటలాడింది. గుంపులు గుంపులుగా సాధారణ భక్తులు స్పెషల్ క్యూలైన్లలో చొరబడడం వివాదానికి దారితీసింది. టిక్కెట్లు కొనుగోలు చేసి భక్తులు పోలీసులతో గొడవకు దిగారు. ఇదిలా ఉంటే ఈఓ నానాజీబాబు, తదితరుల అలసత్వం కారణంగా దేవదాయశాఖ ఆదాయానికి గండిపడింది. చాలా మంది టికెట్లు తీయకుండానే స్పెషల్, వీఐపీ క్యూలైన్లలో వెళ్తిపోతున్నా సిబ్బంది నిస్తేజంగా ఉండిపోయారు
రాజాం సిటీ: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి శతవార్షిక జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున ఆలయ మేనేజర్ బీవీ మాధవరావు తొలి పూజ చేసి యాత్రను ప్రారంభించారు. ప్రతి ఏటా మాదిరిగానే ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్టా కల్యాణ్‌చక్రవర్తి పూజలు చేసి హుండీని, చెలికాని బదరీబాబు టిక్కెట్ కౌంటర్‌ను ప్రారంభించారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు నూతన వస్త్రాలను డాక్టర్ పీఎల్‌ఎన్ రాజు (రఘు) అందజేశారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన జాతర సాయంత్రానికి ఊపందుకుంది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాజాం టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్రరావు, పోలీసులు భద్రతా ఏర్పాట్ల నడుమ మొదటి రోజు జాతర ప్రశాంతంగా జరిగింది.
కరుణించు.. కనక మహాలక్ష్మి
కరుణించు.. కనక మహాలక్ష్మి


