ఆస్తులున్నా.. ఆదాయం సున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఆస్తులున్నా.. ఆదాయం సున్నా..

Feb 23 2026 9:39 AM | Updated on Feb 23 2026 9:39 AM

ఆస్తు

ఆస్తులున్నా.. ఆదాయం సున్నా..

ఆస్తులున్నా.. ఆదాయం సున్నా..

రాజాం/సంతకవిటి: సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలో గల సీతారాముల ఆలయ ఆస్తులకు రక్షణ కరువైంది. ఎక్కడెక్కడో వందల ఎకరాల్లో ఉన్న ఆలయ భూముల నుంచి పైసా ఆదాయం రావడం లేదు. పోనీ ఆలయం చుట్టూ ఉన్న ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే అదీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. గుళ్ల సీతారాంపురంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న దేవాలయ ఆస్తులకు ఇప్పుడు ముప్పు ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. నెలవారీ అద్దె చెల్లింపు ఒప్పందం పేరుతో గ్రామానికి చెందిన కూటమి నేతల కనుసన్నల్లో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ భూముల్లో షాపులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ భూముల్లో పదుల సంఖ్యలో షాపులు వెలిశాయి. అయితే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని టీడీపీ కార్యకర్తలు అనుభవిస్తున్నారు తప్ప దేవదాయశాఖకు మాత్రం పైసా కూడా అందడంలేదు.

చర్యలేవీ..?

గుళ్లసీతారాంపురంలో సీతారాముల ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. 16 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఏకశిల కావడం విశేషం. కేవలం సీతారాములు మాత్రమే ఈ ఆలయంలో కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయంలో గతంలో ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, నైట్‌ వాచర్‌, సేవకులు ఉండేవారు. ఇప్పుడు అర్చకులు ఒక్కరే ఉన్నారున. ఈయనకు కూడా కనీస వేతనం లేదు. దీపధూప నైవేధ్యాల చెల్లింపులు కూడా ఇవ్వడం లేదు. దేవునికి పస్తులుపెట్టి, ఆలయానికి చెందిన ఆస్తులు మాత్రం కొంతమంది అప్పనంగా అనుభవిస్తున్నారు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడ డోలాయాత్ర జరుగతుంది. ఈ యాత్ర గ్రామస్తులు నిర్వహించుకోవడమే తప్ప దేవదాయశాఖ నుంచి ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడం విశేషం. ఆలయానికి చెందిన కోట్ల విలువ చేసే ఆస్తులను పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు.

వసూలు చేస్తాం..

ఆలయాని పక్కనే నాలు గు ఎకరాలకు పైగా దేవదాయశాఖ భూమి ఉంది. ఈ స్థలాల్లో షాపులు నిర్మించిన విషయం వాస్తవమే. వాటి అద్దెలను అరకొరగా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది పక్కాగా వసూలు చేస్తాం. ఆలయ జాతర, నిర్వహణ దేవదాయశాఖ ద్వారా చేపడతాం. అద్దె చెల్లించని షాపులను తొలగిస్తాం.

– బీవీ మాధవరావు,

దేవదాయశాఖ ఈఓ, రాజాం.

అంతా కూటమి కనుసన్నల్లోనే..

గుళ్లసీతారాంపురం గ్రామంలో 16 శతబ్దాపు నాటి సీతారాముల ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్వహణకు అప్పట్లో బొబ్బిలి రాజులు 450 ఎకరాల భూములు కేటాయించారు. ఇప్పుడు ఆ భూములు ఎక్కడ ఉన్నాయో.. ఎలా ఉన్నయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆలయం పక్కనే రాజాం – సంతకవిటి ప్రధాన రహదారికి ఆనుకుని 4.30 ఎకరాల పక్కా భూమి ఉంది. రూ. కోట్లు విలువ చేసే ఈ భూమిలో ఏడాదిన్నర కిందట షాపులు వెలిశాయి. ఒకరిని చూసి ఒకరు ఆ భూమిలో ప్రధాన రహదారిని ఆనుకుని షాపులు నిర్మించారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో నెలవారీ అద్దె చెల్లింపుల ఒప్పందంతో ఈ నిర్మాణాలు ప్రారంభించిన షాపుల యజమానులు పక్కా గోడలు నిర్మించి, షాపులు ఏర్పాటు చేసుకున్నారు. దేవదాయశాఖకు నెలకు రూ. 500లు, రూ. 1000లు చొప్పున అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ షాపులు నిర్మించినవారిలో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులే ఉన్నారు. అయితే వీరు ఈ షాపులను ఇతరులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అద్దెలకు ఇచ్చేసి డబ్బులు వెనకేసుకుంటున్నారు. అయితే దేవదాయశాఖకు చెల్లించాల్సిన అద్దెలు మాత్రం చెల్లించకపోవడం విశేషం. ఇప్పటివరకు రెండు పర్యాయాలు నెలకు రూ. 10 వేలు చొప్పున గ్రామ పెద్ద తమకు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇంకా అందలేదని దేవదాయశాఖ ఈఓ మాధవరావు తెలిపారు. ఎక్కడైనా భూములు లీజుకు తీసుకునే ఒప్పందం ఉంటుంది.. ఇక్కడ మాత్రం నెల వారీ నామమాత్రపు అద్దె పేరుతో దేవుడి భూములు కాజేయడం విశేషం.

ఆస్తులున్నా.. ఆదాయం సున్నా..1
1/1

ఆస్తులున్నా.. ఆదాయం సున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement