
సంగీత సాహిత్య సమలంకృతే..!
విజయనగరం టౌన్: సంగీత సరస్వతికి స్వరనీరాజనం పలికారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన విజయనగరం ఉత్సవాల్లో సంగీత కళాకారులు కళామతల్లిని స్తుతిస్తూ చేసిన స్వరాభిషేకం ఆద్యంతం రక్తికట్టించింది. విజయనగర ఉత్సవాల్లో భాగంగా స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో ఘంటసాల, ద్వారం వంటి ఎందరో మహనీయులు సాధన చేసిన కచేరీ మందిరంలో 32 బృందాలు, 315 మంది కళాకారులు తమ స్వరఝరిని వినిపించి, కళ్లకు కట్టినట్లు చూపించి చూపరులను కట్టిపడేశారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇవే..
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమాలను జ్యోతిప్రజ్వలన, ప్రార్థనాగీతాలాపన, స్వాగత నృత్యాంజలితో ప్రారంభించారు. ఎన్.గోపాలరావు బృందం నాదస్వరం, శ్రీహరి సంకీర్తన ఝరి ఎన్.వెంకటరావు బృందం గాత్రం, ఎన్.కాళీప్రసాద్ బృందం గాత్రం, కె.ఎ.పద్మప్రియ బృందం వీణకచేరీ, నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ భేరిరాధికారాణి బృందం నృత్యప్రదర్శన, అమృతవర్షిణి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ టి.సౌమ్య బృందం నృత్యప్రదర్శన ఆద్యంతం అలరించాయి. టి.తన్మయి బృందం నృత్యప్రదర్శన, టి.అమ్మాజమ్మ గాత్రకచేరీ చూపరులను కట్టిపడేశాయి. సీహెచ్.శైలజ గాత్రం, ఎన్‌వీ.కామేశ్వరరావు ప్లూట్ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ఎస్‌వీఎన్.వివేక్, శరత్ బృందం మైమ్, అభినయ డ్యాన్స్ స్కూల్ ఎం.సాయి ప్రియబృందం, ఇబ్రహీం ఖాన్ బృందం దూడ శ్రీదేవి, పి.క్రిషిక, కరుణల నృత్యప్రదర్శనలు, జి.రాధిక బృందం, కె.పెంటయ్యనాయుడుల గాత్రకచేరీ, పీవీఎన్‌ఎల్ సారథి బృందం వయోలిన్, టి.సత్యనారాయణ బృందం నృత్యప్రదర్శన, పి.సూర్యకుమారి, కె.స్వాతిప్రియదర్శిని బృందం నృత్యప్రదర్శన, వి.అప్పలస్వామి నృత్యప్రదర్శన, ఐ.మెహరలత గాత్రకచేరీ, డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి బృందం గాత్రకచేరీ అలరించాయి.
కళాకారులకు సత్కారం
కె.విద్యాసాగర్ బృందం, డాక్టర్ మండపాక రవి మృదంగం, బి.మంజూష బృందం, ఎ.శైలజల నృత్యప్రదర్శన, శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ ఎం.భీష్మారావు బృందం గాత్రకచేరీ ఆద్యంతం ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం కళాకారులను నిర్వాహకులు దుశ్శాలువాలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లైఫ్ మెంబర్స్ పిళ్లా విజయకుమార్, రామయ్యపంతులు, వేదిక ఇన్‌చార్జ్ అధికారులు కవిత, జానకమ్మ, నాగలక్ష్మిలు సహకారమందించారు.
సంగీత సరస్వతికి స్వర నీరాజనం
32 రకాల సంగీత బృందాలు, 315 కళాకారులతో స్వరాభిషేకం
ఆహూతుల మన్ననలు పొందిన సంగీత, నృత్యప్రదర్శనలు
విజయనగర ఉత్సవ వేదికలో మిన్నంటిన స్వరఝరి