
అర్ధరాత్రి లాఠీ చార్జ్
● జమ్ము గ్రామంలో ఉద్రిక్తత
● గ్రామస్తులపై విరుచుకుపడిన పోలీసులు
● పలువురికి గాయాలు
గుర్ల: మండలంలో ఇంతవరకూ లేని సంస్కృతిని పోలీసులు అలవాటు చేస్తున్నారు. కూటమి నేతల ఆశీస్సులు పొందేందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష కట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేస్తూ భయభ్రాంతులకు గురుచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రశాంతంగా ఉండే గ్రామం మండలంలోని జమ్ము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఆ గ్రామంలో టీడీపీ నేతలు పెత్తనం చేయడానికి ప్రయత్నించారు. కానీ వీలు పడకపోవడంతో గ్రామంలో ఎదో ఒక అలజడి సృష్ఠించి పోలీసులను, అధికారులను రంగప్రవేశం చేయించి వారిపై తీవ్ర ఒత్తిడి చేసి వారి మాటను నెగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని పర్యావసానంగా గ్రామంలో శనివారం దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతుండగా అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళులు, పెద్దలు, యువతపై పోలీసులు ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఈ లాఠీ చార్జ్‌లో గ్రామానికి చెందిన సారంపాటి ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మంది మహిళలకు ఒంటిపై పోలీసుల లాఠీ దెబ్బలు తీవ్రంగా కనిపిస్తున్నాయి.
పోలీసుల తీరుకు ఖండన
జమ్ము గ్రామంలో దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం జరుగుతుండగా వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి విచక్షణా రహితంగా కొట్టడాన్ని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ కార్యదర్శి కెంగువ మధుసూదనరావు, నియోజక వర్గ బీసీ సెల్ అధ్యక్షుడు జమ్ము స్వామినాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రశాంతమైన పల్లెలో అల్లర్లు సృష్ఠించి ఉద్రిక్త వాతావారణాన్ని నెలకొల్పుతున్న పోలీసుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీ చార్జ్‌లో గాయపడి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అర్ధరాత్రి లాఠీ చార్జ్