
మూతపడిన జనరిక్ మందుల షాపు
● అధిక ధరకు మందుల కొనుగోలు
● ఇబ్బందులు పడుతున్న పేదరోగులు
విజయనగరం ఫోర్ట్: ఏజబ్బు అయినా సరే మందుల ద్వారానే నయమవుతుంది. అధికశాతం మంది ప్రజలు బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ, లివర్, గుండె, అర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రైవేట్ మందుల దుకాణాల్లో మందులు కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. పేద, మధ్య తరగతి వర్గాలకు అది అదనపు భారమే. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ ధరకు మందులు లభించే జనరిక్ మందుల దుకాణం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అవసరమైతే జనరిక్ మందుల దుకాణాలను పెంచాల్సి ఉంది. కానీ ప్రభుత్వసర్వజన ఆస్పత్రి ఆవరణంలో ఉన్న జనరిక్ మందుల దుకాణం మూత పడి రోజులు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న షాపు అకస్మాత్తుగా మూతపడినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువ మంది రోగులు మందుల కొనుగోలు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి నిత్యం ఓపీ విభాగానికి 1000 నుంచి 1200 మంది వస్తారు. వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు ఉచితంగా ఇస్తారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులను రోగులు జనరిక్ మందుల దుకాణంలో కొనుగోలు చేసేవారు. అదేవిధంగా బీపీ, షుగర్ , కేన్సర్ వంటి ధీర్ఘకాలిక రోగులు కూడా ఇక్కడే మందులు కొనుగోలు చేసేవారు. ప్రైవేట్ మెడికల్ షాపుల కంటే అతి తక్కువ ధరకు మందులు లభించడంతో అధికశాతం మంది జనరిక్ మందులు దుకాణంలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.
20 రోజులవుతున్నా పట్టించుకునే వారే కరువు
జనరిక్ మందుల దుకాణం మూత పడి 20 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకున్న దాఖలాలులేవు. దుకాణం నిర్వహించేవారు ఎందువల్ల తెరవడం లేదనే దానిపై అధికారులు ఆరా కూడా తీయలేదని తెలుస్తోంది.
ఆదేశాల మేరకు చర్యలు
జనరిక్ దుకాణం నిర్వహించే వారికి ఆస్పత్రి నుంచి ఎటువంటి అనుమతులు లేవు, విద్యుత్ బిల్లులు కూడా ఆస్పత్రి నిధుల నుంచే కడుతున్నాం. అద్దె కూడా చెల్లించడం లేదు. దీనిపై డీఎంఈకు లెటర్ రాశాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి