
సిరిమానోత్సవానికి రూట్‌మ్యాప్
విజయనగరం క్రైమ్: పైడతల్లి సిరిమానోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాలను నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ పైడితల్లి జాతరకు వస్తున్న భక్తులు ఈ నెల 7న తేదీన అమ్మవారి సిరిమానోత్సవం సందర్బంగా వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్ చేసేందుకు పలు ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం, కోరుకొండ, జామి, అలమండ, కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఎత్తు బ్రిడ్జి మీదుగా మయూరి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వైపు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన కాశిరాజు సర్కస్ గ్రౌండ్ అయోధ్యమైదానం, ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే ధర్మపురి, డెంకాడ పరిసర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మీదుగా కాశిరాజు సర్కస్ గ్రౌండ్ అయోధ్యమైదానం, ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయాలన్నారు. ఇక నాతవలస, శ్రీకాకుళం, భోగాపురం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ నగర్ కాలనీ జంక్షన్, దాసన్నపేట జంక్షన్ మీదుగా అయ్యకోనేరువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో గానీ లేదా రాజీవ్ నగర్ జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా ఫోర్ట్ సిటీ స్కూల్, ఎస్వీఎన్ లేఔట్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో కానీ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, గుర్ల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్ మీదగా, కొత్తపేట మంటపం పాత బస్టాండ్ మీదుగా రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియం మీదుగా వచ్చి డీఎస్డీఓ ఇండోర్ స్టేడియంలో పార్కింగ్ చేయాలన్నారు. గజిపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, గంట్యాడ, ఎస్.కోట పరిసర ప్రాంతాల నుంచీ వచ్చే వాహనాలు కలెక్టర్ ఆఫీస్ నుంచి గూడ్స్ షెడ్, సీఎంఆర్ జంక్షన్ మీదుగా సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు వ్యతిరేకంగా ఉన్న స్థలంలో పార్క్ చేయాలని సూచించారు. దీంతో పాటు పీజీ స్టార్ హాస్పిటల్ పక్కన గల ఖాళీ స్థలంలోను, ఎస్బీఐ జంక్షన్ నుంచి రామానాయుడు రోడ్డు మీదుగా ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద గల పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేయాలని తెలిపారు. ఏడవ తేదీ ఉదయం నుంచి ఎనిమిదివ తేదీ రాత్రి పదిగంటల వరకు.
ఈ దిగువన నిర్దేశించిన ప్రాంతాల్లో
వాహనాల రాకపోకలు నిషేధమని ఎస్పీ పేర్కొన్నారు.
1. బాలాజీ జంక్షన్ నుంచి సింహాచలం మేడ జంక్షన్
2. సింహాచలం మేడ జంక్షన్ నుంచి కోట
3. బాలాజీ జంక్షన్ నుంచి గంట స్తంభం
4. ఎం.ఆర్ కాలేజీ జంక్షన్ నుంచి గురజాడ సర్కిల్
5. కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి గంటస్తంభం
6. ట్యాక్సీ స్టాండ్ నుంచి గంట స్తంభం
7. సామ్రాట్ లాడ్జి జంక్షన్ నుంచి శివాలయం మీదుగా ఎంజీ రోడ్డు 8.కమ్మవీధి జంక్షన్ నుంచి మూడు లాంతర్లు
9. గుమ్చీ జంక్షన్ నుంచి కోట జంక్షన్ వైపు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిషేధించినట్లు ఎస్పీ దామోదర్ వివరించారు.
నిషేధిత స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసిన పక్షంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.