
పార్వతీపురం మన్యం జిల్లా: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకోవడంపై మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మిగతా మూడు కాలేజీలను మూడు దశలలో పూర్తి చేయాలని భావించిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. కూటమి ప్రభుత్వానికి కనీసం కాలేజీ భవన నిర్మాణాలు చేపట్టడం చేతకావడం లేదన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అవుతుంటే మన్యం జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంధ్యారాణి ఏం చేస్తున్నారంటూ పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికి జిల్లా ప్రయోజనాలను సంధ్యరాణి తాకట్టు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు,. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే అన్ని సంఘాలను కలుపుకుంటూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.