
25లోగా చెరువుల ప్రతిపాదనలు రావాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ చెరువుల కోసం ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ (మరమ్మతులు, పునఃనిర్మాణం, పునరుద్ధరణ) కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా చిన్న నీటిపారుదల మౌలిక సదుపాయాల పరిస్థితి, నిర్వహణ మెరుగు పరచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో కీలకమైన భాగం కానుందన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి ఈ కార్యక్రమం కింద ప్రతిపాదనలన్నీ సిద్ధం చేయాలన్నారు.
25 నాటికి డాక్యుమెంట్లు అప్‌లోడ్ పూర్తి
ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతీ శాఖలో గల డాక్యుమెంట్ల అప్‌లోడ్ ఈ నెల 25 నాటికి పూర్తవుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్‌కు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పలు శాఖాధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజాదృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, స్వమిత్వ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించినట్టు కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, ప్రత్యేక ఉప కలెక్టర్‌లు పి.ధర్మచంద్రారెడ్డి, దిలీప్‌చక్రవర్తి, నీటి పారుదల శాఖ ఈఈ ప్రదీప్, భూగర్భ జలవనరుల శాఖ ఈఈ రామ్మూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, సీపీఓ ఆర్‌కె.పట్నాయక్, డీపీవో కొండలరావుతో పాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు.