
వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు
సాలూరు: వినాయక ఉత్సవాలు జరిగే సమయంలో నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పట్టణంలో మాట్లాడుతూ, వినాయక ఉత్సవాల మంటపాల కోసం సంబంధిత కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి వివరాలు, మంటపాల ప్రదేశం, ఉత్సవాలు జరిపే తేదీలు, నిమజ్జనం జరిపే తేదీలు పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పోలీసులకు ముందస్తుగా తెలియపర్చాలని సూచించారు. మంటపాల వద్ద ఏర్పాటుచేసే వినోద కార్యక్రమాలకు, మైకులకు పోలీసు వారి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.కమిటీ సభ్యులు మంటపాల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మంటపాలు, పరిసర ప్రాంతాల్లో అశ్లీల డ్యాన్సులు, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిషేధమన్నారు. గణేష్ ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమం రాత్రి 11 గంటల్లోపు ముగించాలని కోరారు. నిబంధనలను ఎవరు అతిక్రమించరాదని హితవు పలికారు.
సీఐ అప్పలనాయుడు