
నేడు, రేపు జిల్లాలో భారీ వర్షాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగరాదని, ఇందుకోసం ముందుగా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే సమయంలో ఆరుబయట ఎవరూ తిరగరాదన్నారు. శిథిలావస్థలోని భవనాలు, చెట్ల కింద ఉండరాదని సూచించారు. లోతట్టు, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను దండోరా, మైక్ ద్వారా ప్రచారం చేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, ఇసుకను తవ్వడం వంటి పనులు చేపట్టరాదని సూచించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్