
విజయనగరం మండలం పినవేమలిలో వరి పంటను కోస్తున్న రైతులు
● 400 హెక్టార్లలో పూర్తయిన కోత ● జిల్లాలో 93,820 హెక్టార్లలో వరిసాగు
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం కంటే అధికంగానే వరి పంట సాగైంది. ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్నిమండలాల్లో వరి పంటను రైతులు కోస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంటను కుప్పలుగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు పంటకోత ప్రయోగాలు చేపట్టారు. పంట కోత ప్రయోగాల ప్రకారం ఽ ధాన్యం ఎంత దిగుబడి వస్తుందో వ్యవసాయ అధికారులు అంచనా వేస్తారు.
217 పంట కోత ప్రయోగాలు పూర్తి
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు 217 పంట కోత ప్రయోగాలు చేశారు. మొత్తం 2024 పంట కోత ప్రయోగాలు చేయాల్సి ఉంది. చివరి దశలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో అధికంగానే దిగుబడి వస్తుందని, ఇప్పటివరకు చేసిన పం
టకోత ప్రయోగాల్లో ఎకరాకి 28 నుంచి 29 బస్తాల దిగుబడి రావచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఎకరాకి 27 నుంచి 28 బస్తాల దిగుబడి వచ్చింది.
93,820 హెక్టార్లలో సాగు
జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 90, 235 హెక్టార్లు కాగా దాని కంటే అధికంగానే 93, 820 హెక్టార్లలో సాగైంది. పంటకోత ప్రయోగాలను రైతు భరోసా కేంద్రాల పరిధిలో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు వ్యవసాయ అధికారి సమక్షంలో చేస్తున్నారు.
హెక్టారుకు 5000 నుంచి 5100 కేజీల ధాన్యం
హెక్టారుకు 5000 నుంచి 5100 కేజీల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 4.63 లక్షలమెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడి రావచ్చని అభిప్రాయపడుతున్నారు.