
విజయనగరం క్రైమ్/రాజాం సిటీ: దిశ ఎస్‌ఓఎస్ యాప్ బాలికలకు వరంగా మారింది. సకాలంలో సంఘటనా స్ధలానికి చేరుకుని నిందితులను పట్టుకుని, మహిళలకు అండగా నిలబడుతూ తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్‌పై ప్రజలకు అవగాహన పెరగడంతో కేసులు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి.
ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా వంగర మండల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు రాములు పదోతరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన సెల్‌ఫోన్‌లో బాలిక ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను బాలికకు చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. కీచక టీచర్ ఆగడాలను తట్టుకోలేకపోయిన బాధిత బాలిక దిశ ఎస్‌ఓఎస్‌కి కాల్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. ఫిర్యాదు అందుకున్న నిమిషాల వ్యవధిలోనే దిశ పోలీసులు బాధితురాలి ఇంటికి చేరుకున్నారు.
బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో టీచర్ రాముడును వంగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైన్స్ టీచర్ రాముడు ఫోన్‌లో ఉన్న ఫొటోలు, మెసేజ్‌లను ఆధారాలుగా సేకరించారు. విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో, ఐటీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి అరెస్టు చేశారు. ఎవరికీ చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్న తమకు దిశ పోలీసులు అండగా నిలబడి న్యాయం చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. బాలికలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.