విజయనగరం:
ఉగాది సంబరాలు పేరిట విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి, ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సాంస్కృతికోత్సవంలో పదనిసలు పల్లవించాయి. ప్రదర్శనలు పరవళ్లు తొక్కాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు కనువిందు చేశాయి. కళాకారుల గీతాలు వీనుల విందుగావించాయి. మొత్తంగా సాంస్కృతికోత్సవం పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ చైతన్యానికీ విశ్వసౌందర్యానికీ ప్రతీక ఉగాది పర్వదినమని పేర్కొన్నారు. కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే ఉగాది తెలుగువారి తొలి పండుగగా చెప్పారు. వసుధ మీదకు వసంతం వస్తోందని త్వరలో రానున్న ఉగాది విజయనగరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ కాలం మార్పుల ప్రవాహమని, సుఖ దుఃఖాలు, శుభాశుభాల నిరంతర పరంపరగా వాఖ్యానించారు. 2026 ఉగాదిని పురస్కరించుకుని నృత్య రంగంలో వరలక్ష్మీత్యాగరాజ కళాశాలకు చెందిన గాయత్రి, అమృతవర్షిణి డ్యాన్స్ స్కూల్‌కు చెందిన తెలికిచెర్ల సౌమ్య, లయ లాస్య డ్యాన్స్ స్కూల్‌కు చెందిన బెల్లాన రాజు, విశ్వకర్మ డ్యాన్స్ అకాడమీకి చెందిన ప్రవీణ్‌కుమార్ ఆచార్య, కుమారి హర్షితలకు, సేవారంగం నుంచి ముళ్లపూడి సుభద్రాదేవి, డివి.సత్యనారాయణ, డిమ్స్ రాజు, తాడేపల్లి నాగేశ్వరరావులకు, పాత్రికేయ రంగం నుండి కె.జె.శర్మ, మజ్జి శివకుమార్‌లకు, వెంట్రిలాక్విజమ్ నుంచి శ్రీనివాస పండిట్, ఫొటోగ్రఫీ రంగం నుంచి బుర్రా శ్రీనివాసరావులకు, కళారంగం నుంచి గంటాలక్ష్మీలకు ఉగాది పురస్కారాలను సమాఖ్య అధ్యక్షులు గురుప్రసాద్‌తో కలసి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముందుగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. చిన్నారులను వరలక్ష్మీ త్యాగరాజ నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మిరామదాసు ఆశీర్వదించారు.


