గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీరామ వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ పారాయణం, శ్రీరామలక్ష్మీ జపంతో పాటు అష్టోత్తర, సహస్ర నామార్చనలు నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం శ్రీ సీతారామస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీ స్వామివారి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణంలో పాల్గొనే దంపతులు తమ గోత్రనామాలతో రూ.500లు చెల్లించి పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే దంపతులకు ప్రసాదం, శేష వస్త్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల ఉదయం 19న తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో తెలుగు పండితులు పొందూరు సుధాకుమార్ శర్మచే ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న భక్తులు
తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామివారిని, పద్మావతి అమ్మవార్లను శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తల నీలాలను సమర్పించుకున్నారు మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదానంలో పాల్గొన్నారు.


